Rashtriya Bal Puraskar winner virat chandra : అతి చిన్న వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు సికింద్రాబాద్‌కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం-2022కు ఎంపిక చేసింది. క్రీడలు, కళలు, సంస్కృతి, సాహసం, వినూత్న ఆవిష్కరణ తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచే 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేస్తోంది. దేశవ్యాప్తంగా 29 మంది ఈ అవార్డుకు ఎంపికకాగా తెలంగాణ నుంచి విరాట్ ఒక్కడే ఉన్నాడు.
పీఎం మోదీ అభినందన
మూడో తరగతి చదువుతున్న విరాట్ చంద్ర... గతేడాది మార్చి 6న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5,895 మీటర్ల ఎత్తులోని శిఖరం అంచుకు ఆరు రోజుల్లో చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్ చంద్ర ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందాడు. విరాట్ సాధించిన ఘనతకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయికి చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
రోజూ సాధన
తనకు రాష్ట్రీయ బాల పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందని చిన్నారి విరాట్ చంద్ర అంటున్నాడు. పర్వతారోహణ కోసం రోజూ కష్టపడేవాడినని చెబుతున్నాడు. కీసర, మౌలాలి గుట్టలను ఎక్కి ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు.
మా అమ్మనాన్న సపోర్ట్ వల్ల నేను కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాను. నేను రోజూ కష్టపడేవాడిని. రోజూ 6 నుంచి 7 కిలోమీటర్ల రన్ చేసేవాడిని. కీసర, మౌలాలి గుట్టలను ఎక్కి ప్రాక్టీస్ చేశాను.
-విరాట్ చంద్ర, రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత