గతంలో ఎన్నడూ లేనంతగా విజయ డెయిరీలో పాల సేకరణ 50 శాతానికి పడిపోయింది. రోజుకు సగటున 4 లక్షల లీటర్ల పాలు సేకరించాల్సి ఉండగా... ప్రస్తుతం రోజుకు 2 లక్షల లీటర్లు మాత్రమే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పాల సేకరణ 10 శాతం తగ్గితే... ఒక్క విజయ డెయిరీలోనే సగానికి పడిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
రానున్న రోజుల్లో మరింత కష్టం...
రాయితీపై పాడి పశువుల పంపిణీ, లీటరుపై 4 రూపాయల ప్రోత్సాహం, రూ.129 కోట్ల విలువైన దాణా పంచుతున్నా... సేకరణ తగ్గడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అనూహ్య వాతావరణ మార్పులు పాడి పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చలికాలం ముగియక ముందే ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఆవులు, గేదెలు ఎదకు రావడం లేదు. కృత్రిమ గర్భధారణ ప్రయత్నాలు చాలా వరకు విఫలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో పాల సేకరణ మరింత కష్టసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆసక్తి చూపని రైతులు..
ప్రైవేటు డెయిరీల నుంచి పోటీ విపరీతంగా పెరిగిపోయింది. లీటర్ పాలకు విజయడైరీ రూ.30 నుంచి 60 వరకు చెల్లిస్తుంటే... అదే ప్రైవేటు డెయిరీలు మాత్రం రూ.35 నుంచి 70 మధ్య చెల్లిస్తున్నాయి. పైగా ఇంటి వరకు వచ్చి పాలను కొంటున్నాయి. రైతులే స్వయంగా అమ్ముకుంటే లీటరుకు రూ.80 వరకు వస్తుండటం వల్ల విజయ డెయిరీకి పాలు పోసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అదనపు ప్రోత్సాహం చెల్లింపులో జాప్యం, పాడి పశువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, క్షేత్రస్థాయిలో ప్రైవేటు డెయిరీలతో కుమ్మక్కవుతోన్న కొంతమంది అధికారుల వ్యవహారశైలి పాల సేకరణకు పెద్ద తలనొప్పిగా మారింది.