తల్లిపాలు అందించినంత బలాన్ని మాతృభాష అందిస్తుందనీ, అలాంటి భాషకు ప్రాధాన్యమిచ్చి మన సంస్కృతిని కాపాడుకుందామని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రపంచవ్యాప్త తెలుగువారికి పిలుపునిచ్చారు. ఆదివారం ‘తెలుగు భాషా దినోత్సవం-2021’ రెండోరోజు కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ‘వీధి అరుగు’ (నార్వే), ‘దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్త ఆధ్వర్యంలో 75 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో దీనిని నిర్వహించారు. ‘‘భాష అంటే మాటల వారధి మాత్రమే కాదు. మన గతం, మూలాలు, సంస్కృతి, సభ్యత, ఆచార వ్యవహారాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. భాష సమాజాన్ని సృష్టిస్తుంది. జాతిని బలపరిచి అభివృద్ధికి బాటలు వేస్తుంది. తెలుగు నేర్చుకోవడాన్ని బాధ్యతగా భావించాలి. తర్వాత మిగతా భాషలపై దృష్టి సారిద్దాం. భాష మన ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది’’ అని ఆయన చెప్పారు.
మేమంతా మాతృభాషలో చదువుకున్నవాళ్లమే..
ముందు తరాలకు తెలుగును అందించాలంటే భాష అధునాతనంగా మారాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. పదహారణాల తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకొనేందుకు 16 సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. అవి..
1. తెలుగువారి వారసత్వం, సాహిత్య సంప్రదాయాలు, జానపదాలను తక్కువ చూపు చూడొద్దు. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులను గౌరవించాలి. పిల్లలకు తెలుగుభాష నేర్పాలి.
2. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన చేయాలి. తెలుగు భాషలోకి తగిన శాస్త్ర గ్రంథాలను తీసుకురావాలి. శాస్త్రీయ పదాలకు అర్థం చెప్పే నిఘంటువులు రావాలి. సాంకేతిక విద్యలో క్రమంగా మాతృభాష వినియోగం పెరగాలి.
3. ఆంగ్లభాషలో చదువుకోకపోతే ఉన్నత స్థానానికి ఎదగలేమన్నది నిజంకాదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేను, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ.. అందరం మాతృభాషలో చదువుకొని పైకొచ్చినవాళ్లమే.
4. కుటుంబ సభ్యులతో తెలుగులో మాట్లాడుకుంటే భాష సజీవంగా ఉంటుంది.
5. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార మార్పిడి మాతృభాషలోనే జరగాలి. హైకోర్టుల వరకు తీర్పులు మాతృభాషలోనే అందించే ప్రయత్నం జరగాలి.
6. సహజంగా ఇమిడిపోయే ఇతర భాషా పదాలను వ్యతిరేకించకూడదు. కొత్త పదాల సృష్టికి ప్రయత్నించాలి. భాష సజీవంగా ఉండేలా, అందరికీ అర్థమయ్యేలా ప్రామాణిక నిఘంటువు తయారు చేసుకోవాలి.
7. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించేందుకు, ఇతర భాషా సాహిత్యం తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతర ప్రక్రియ సాగాలి.
8. కంప్యూటర్‌లో తెలుగు వినియోగాన్ని పెంచాలి. అందమైన తెలుగు ఖతులను వినియోగించాలి. వారంలో ఒక్కరోజైనా కుటుంబంలో అందరూ తెలుగే మాట్లాడాలి.
తెలుగు పత్రికలు చదివించాలి..
9. జానపదాలను కాపాడుకోవాలి.
10. తెలుగు పత్రికలు, బాలల పత్రికలు పిల్లల చేత చదివించాలి.
11. శుభలేఖలు తెలుగులోనే అచ్చు వేయించాలి.
12. కొవ్వొత్తులు ఆర్పి కాకుండా దీపాలు వెలిగించి పుట్టిన రోజులు చేసుకోవాలి.
13. ఇళ్లలో తెలుగు పుస్తకాలతో చిన్నచిన్న గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి. సంస్కృతంలో మంత్రం చెప్పినా దానికి తెలుగులో అర్థం చెప్పాలి.
14. తెలుగు వంటకాలు, పచ్చళ్లు, ఆహారపు అలవాట్లు సజీవంగా ఉంచాలి. మన సంప్రదాయ వంటకాలు ఆరగించేవారికి కరోనా సమయంలో పెద్దగా జబ్బులు రాలేదు.