Vibha Jewellers Anisha Success story: బంగారం, నగలంటే... మక్కువ లేని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఆభరణాలు అందరి కంటే భిన్నంగా ఉండాలని ఆశపడతారు. అందుకే.. వారికి నచ్చినవి దొరికే వరకు షాపింగ్ చేస్తూనే ఉంటారు. మరి అలాంటి... వాళ్లకు వారికి నచ్చిన నగల్నే అందిస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఆలోచనతోనే నగల వ్యాపారంలోకి వచ్చింది మన భాగ్యనగర మహిళ అనీషా.
సాఫ్ట్‌వేర్ కొలువు వదిలేసి
బీటెక్ పూర్తి చేసి అనీషా మంచి జీతంతో సాఫ్ట్‌వేర్ కొలువులో స్థిరపడింది. ఉద్యోగం కంటే వ్యాపారం పైనే తనకి ఆసక్తి ఎక్కువ. పైగా తన తల్లీ నగల వ్యాపారంలో ఉండటంతో తన ఆలోచనలూ వాటి చుట్టూనే తిరుగుతుండేవి. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో నగల వ్యాపారం ప్రారంభించింది అనీషా. సరికొత్త ఆలోచనలు, విభిన్న వ్యాపారం సూత్రాలతో వినియోగదారుల్లో మంచి ఆదరణ సాధించింది. దాంతో సాఫ్ట్‌వేర్ కొలువు వదిలేసి పూర్తిగా వ్యాపారంలోకి వచ్చేసింది. అలా 2014లో 'విభా' పేరుతో నగల వ్యాపారాన్ని ప్రారంభించింది.
"మొదటగా వ్యాపారాన్ని హబ్సీగూడలో ప్రారంభించాను. ఒక సింగిల్ టేబుల్‌తో వ్యాపారం మొదలుపెట్టాను. పరిమిత సంఖ్యలో స్టాక్ ఉన్నా బాగా అమ్ముడుపోయాయి. వినియోగదారుల నుంచి మంచి స్పందన ఉండేది. వారి అభిరుచికి తగినట్లుగా డిజైన్లు రూపొందించాను."- అనీషా, విభా జ్యూయలర్స్ నిర్వాహకురాలు
తక్కువ బరువులో నగలు
Women's Day Special: వినియోగదారుల నమ్మకమే తనను ఈ రంగంలో ముందుకు నడిపిస్తుందని భావించిన అనీషా.. అన్ని విషయాల్లో పారదర్శకత పాటించింది. నాణ్యత, తూకం సహా.. కొన్నివిషయాల్లో బయటి సంస్థలకు వేరుగా వ్యవహరించింది. స్వయంగా తానే విభిన్న రకాల డిజైన్లతో నగలు తయారు చేయించింది అనీషా. దాంతో మార్కెట్‌లో మరెక్కడా లభించనవి మోడళ్లు... విభాలో స్టోర్‌లో అందుబాటులోకి వచ్చాయి. అత్యుత్తమ నాణ్యతతో పాటు తక్కువ బరువుతో మంచి నగలను అందించాలన్నది అనీషా లక్ష్యం. అందుకే మార్కెట్‌లో కనీసం 100 గ్రాములు బరువుండే నగల్ని 60 నుంచి 70 గ్రాముల్లోనే అందిస్తోంది. ఫలితంగా ఒక మోడల్‌కు పెట్టాల్సిన డబ్బుతో రెండు మోడళ్లు తీసుకుంటున్నారు కస్టమర్లు. ప్రస్తుతం విభాలో 2 గ్రాముల నుంచి అత్యంత ఖరీదైన నగల వరకు అన్నీ లభిస్తున్నాయి.