తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్కెట్‌లోకి ‘బెనిషాన్‌’ పండ్లే కాదూ కూరగాయలు కూడా...! - కూరగాయలు

రైతులకు లాభదాయకంగా ఉంటూ.. మామిడి పండ్లును మార్కెటింగ్​ చేసిన సెర్ప్​ నూతనంగా  ‘బెనిషాన్‌’ కూరగాయలతో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి సేకరిస్తున్న  వివిధ రకాల కూరగాయలను రోజుకు  నాలుగు మెట్రిక్​ టన్నుల వరకూ మార్కెటింగ్​ చేస్తుంది.

మార్కెట్‌లోకి ‘బెనిషాన్‌’ పండ్లే కాదూ కూరగాయలు కూడా...!

By

Published : Nov 24, 2019, 11:17 AM IST

బెనిషాన్‌ బ్రాండ్‌తో మామిడి కాయలు మార్కెటింగ్‌ చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) తాజాగా కూరగాయల మార్కెటింగ్‌పై దృష్టి పెట్టింది. దీని కోసం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ(ఎఫ్‌పీవో)లను ప్రారంభించింది. వీటిలో కూరగాయల లభ్యత ఎక్కువగా ఉన్న 8 జిల్లాలను గుర్తించి అక్కడి నుంచి సేకరిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 6న ఈ ప్రకియ మొదలైంది. గత రెండు నెలల్లో 180 మెట్రిక్‌ టన్నుల కూరగాయలు సేకరించి మార్కెటింగ్‌ చేసింది. ప్రస్తుతం రోజుకు సగటున 4 మెట్రిక్‌ టన్నుల వరకు సేకరిస్తుండగా, రానున్న రెండు నెలల్లో రోజుకు 10 మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రామాల్లో మొదలై మార్కెట్​ వరకు ప్రయాణం

గ్రామాల్లో ఎఫ్‌పీవోల్లో సభ్యులుగా ఉన్న వెయ్యి మంది రైతులు కూరగాయలు సరఫరా చేస్తున్నారు. వీటిని విలేజ్‌ లెవల్‌ ప్రొడక్షన్‌ సెంటర్ల (వీఎల్‌పీసీ)కు తీసుకువచ్చి నాణ్యత ఆధారంగా గ్రేడ్‌-ఏ, గ్రేడ్‌-బీ అని విభజిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా మొమిన్‌పేట్‌, సిద్దిపేట-బస్వాపూర్‌, రంగారెడ్డి-యాచారం, సూర్యాపేట-చివ్వెంల, మెదక్‌-శివంపేట్‌, ఆసిఫాబాద్‌-రెబ్బన, ఆదిలాబాద్‌-గుడిహత్నూర్‌, నాగర్‌కర్నూల్‌-వెల్దండలో మొత్తం 8 వీఎల్‌పీసీలు ఉన్నాయి. గ్రేడింగ్‌ పూర్తయ్యాక అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని బెనిషాన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి తీసుకొచ్చి రత్నదీప్‌, మోర్‌, యెల్లో అండ్‌ గ్రీన్‌, బిగ్‌ బాస్కెట్‌ మొదలైన సంస్థలకు విక్రయిస్తున్నారు.

రైతులకు లాభదాయకంగా

మార్కెట్‌లో ఉండే ధర కంటే ఒకట్రెండు రూపాయలు ఎక్కువగా గ్రేడ్‌లను బట్టి సెర్ప్‌ ధరలు చెల్లిస్తోంది. రైతులకు రవాణా ఖర్చులుండవు. ఏవిధంగానైనా ఇది రైతులకు మేలు చేస్తుందని సెర్ప్​ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీవోవో) రజిత తెలిపారు. రైతుల నుంచి సేకరించి 15శాతం అధిక ధరకు కంపెనీలకు విక్రయిస్తున్నామన్నారు. ఆ సొమ్మునూ రైతులకే ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో నూతన వీఎల్‌పీసీని ప్రారంభించి బొప్పాయి, కాకరకాయ, జామ కాయలను బ్రాండ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన రెండు నెలల్లో రూ.32,88,786 లావాదేవీలు కూరగాయల మార్కెటింగ్‌ ద్వారా చేపట్టామని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: ఎలాంటి విపత్తునైనా 'డీఆర్​ఎఫ్​ ట్రక్కులతో' ఎదుర్కొంటాం: విశ్వజిత్​

ABOUT THE AUTHOR

...view details