తెలంగాణ

telangana

ETV Bharat / state

vegetables price hike news: సామాన్యుడికి కూర'గాయాలు'.. తగ్గిన ఉత్పత్తి... ఎగసిన ధరలు!

భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూరగాయ పంటలు (vegetables price hike news) దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయాల ఉత్పత్తి తగ్గింది. కూరగాయల రెట్లు మిన్నంటాయి.

vegetables price hike news
vegetables price hike news

By

Published : Nov 22, 2021, 9:39 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కడప రైతుబజార్‌లో కిలో టమాటా రూ.100, క్యాప్సికం 120, క్యారెట్‌ రూ.80.. తిరుపతి రైతుబజార్‌లో కిలో పచ్చిమిర్చి రూ.95, టమాటా రూ.82, క్యారెట్‌ 72, దొండకాయ రూ.70, వంకాయ రూ.68, కాకరకాయ రూ.68, బీరకాయ రూ.68, దోసకాయ రూ.60 పలుకుతున్నాయి. బంగాళదుంప కూడా రూ.38 పైమాటే. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప తదితర జిల్లాలే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వానలకు కూరగాయ పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.

సామాన్యుడికి కూర'గాయాలు'.. తగ్గిన ఉత్పత్తి... ఎగసిన ధరలు!

వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పొలాల్లో నీరు నిలిచి ఎర్రబారుతున్నాయి. దిగుబడులు పడిపోతుండటంతో మార్కెట్‌కు సరకు తగ్గింది. ఒక్కో మార్కెట్‌కు 40 నుంచి 50 క్వింటాళ్లు రావాల్సి ఉంటే.. ఏడెనిమిది క్వింటాళ్లే అందుబాటులో ఉంటున్నాయి. డీజిల్‌ ధరల పెరుగుదలతో రవాణా వ్యయమూ పెరిగింది. వెరసి రాష్ట్రవ్యాప్తంగా అధిక శాతం కూరగాయల ధరలు కిందటి నెలతో పోల్చితే 100 నుంచి 200% వరకు పెరిగిపోయాయి. నాలుగైదు రోజులుగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలను వానలు ముంచెత్తడంతో అక్కడ రేట్లు మరింత భారమయ్యాయి. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.40 పైమాటే. టమాటా రూ.80 పైన పెట్టాల్సిందే. రేటు సంగతి సరే.. కూరగాయలు దొరికితేగా? అన్నట్లుంది రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. మొన్నటి వరకు కిలోల లెక్కన కూరగాయలు కొన్న వినియోగదారులు ఇప్పుడు పావు కిలో, అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు.

పూత నిలవదు.. కాపు దక్కదు

అక్టోబరు మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో పూత నిలవడం లేదు. పొలాల్లో తేమ ఎక్కువై తోటలు ఎర్రగా మారుతున్నాయి. కొన్నిచోట్ల అధిక తేమ కారణంగా ఉరకెత్తుతున్నాయి. వానలు తగ్గాక అక్కడక్కడా పూత వచ్చినా.. మళ్లీ జల్లులు పడుతుండటంతో అది కాస్తా రాలిపోతోంది. దీంతో కాపు పూర్తిగా దెబ్బతిందని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. తీగజాతి కూరగాయల తోటలు అధికంగా దెబ్బతిన్నాయని వివరిస్తున్నారు. మరికొన్నాళ్లు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు.

రైతుబజార్ల కంటే బయట 30% అధికం

బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు రైతుబజార్ల కంటే 30% నుంచి 60% వరకు అధికంగా ఉంటున్నాయి. కిలో టమాటా రైతుబజార్లలోనే రూ.72 వరకు పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో రూ.100 వరకు ఉంది. కిలో రూ.10 నుంచి రూ.20 లోపు ఉండే దోసకాయ ఏకంగా రూ.40కి చేరడం ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలకు నిదర్శనం.

ABOUT THE AUTHOR

...view details