వరుణీ జైస్వాల్... టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా అందరికీ సుపరిచితమే. ఐటీటీఎఫ్ వరల్డ్ జూనియర్ విభాగంలో స్వర్ణం సాధించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకాల పంట పండించింది. ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ జూనియర్ విభాగంలో స్టేట్ నంబర్‌గా ఉన్న వరుణీ.. వరల్డ్ ఛాంపియన్ షిప్, ఒలంపిక్స్‌లో పతకం సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
8 భాషల్లో భగవద్గీత...
వరుణీ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్‌బెల్ట్, ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్, నాంచాక్ తిప్పడంలో సిద్ధహస్తురాలు. 8 భాషల్లో భగవద్గీతను వల్లెవేసినందుకు గాను ఇంటర్నేషనల్ చిల్డ్రెన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు, హిందూస్తానీ శాస్త్రీయ సంగీత పోటీల్లో తెలంగాణ టాపర్‌గా నిలిచి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసా పత్రం అందుకుంది. కెరీర్లో సీరియస్‌గా సాగిపోతూనే.. కవితలు, చలోక్తులు చెబుతూ సరదాగా ఉంటుంది. మధురమైన గాత్రంతో ఆహుతులను కూడా మంత్రముగ్దులను చేస్తున్నది.
విజయం వెనుక తండ్రి ప్రోత్సాహం
తన విజయం వెనుక తండ్రి ప్రోత్సాహం వెలకట్టలేనిది అంటోంది వరుణీ. తనకు మొదటి గురువు, రోల్ మోడల్ మాత్రం తండ్రే అని.. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఆయన నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. టేబుల్ టెన్నిస్‌లో ప్రపంచ వేదికలపై దేశ పతాకాన్ని ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేసింది. అభిరుచి ఉన్న రంగాల్లోనే ఎవరైనా రాణిస్తారు... అలా తన కూతురు అభిరుచి ఏ రంగంలో ఉందో అని.. అన్నింట్లో ప్రవేశం కల్పించానని తండ్రి పేర్కొన్నారు. వరుణీ మాత్రం పరిచయం చేసిన ప్రతీ రంగంలోనూ అత్యూత్తమ ప్రతిభ కనబరిచిందని తెలిపారు.
ఆటలు, కళలు
18ఏళ్ల వరుణీఆటల్లో ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తునే... మరోవైపు కళలు, ప్రదర్శనల్లో తనేంటో నిరుపించుకుంటోంది. అభిరుచి ఉన్న అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.
ఇవీ చూడండి: మనసులో ఉండాలి