Rains in TS: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిశా పరిసర ఛత్తీస్గఢ్లో ఉన్న ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉందని తెలిపింది. నిన్నటి ఉత్తర - దక్షిణ ద్రోణి ఈరోజు బలహీన పడినట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
హైదరాబాద్‌లోని భారీ వర్షం:ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని చింతల్, గాజులరామారం, జీడిమెట్లలో వర్షం దంచికొట్టింది. సురారంలో, దుండిగల్, కాప్రా, ఎల్లారెడ్డిగూడ, కుషాయిగూడలో వాన పడింది. నాగారం, దమ్మాయిగూడలో భారీగా వర్షం కురిసింది.