రాష్ట్రంలో గిరిజన సంక్షేమ వసతి గృహాల వార్డెన్ పోస్టుల అర్హతల్లో మార్పులతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. నాలుగేళ్ల క్రితం జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలకు, 2022లో ఇచ్చిన ప్రకటనలో సూచించిన అర్హతల్లో పలు మార్పులు చేయడంతో దాదాపు పెద్దసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. విద్యార్హతల్లో మార్పుల విషయాన్ని గిరిజన సంక్షేమశాఖ ముందస్తుగా స్పష్టం చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
విద్యార్హతల్లో స్పష్టత లేకపోవడంతో 106 గిరిజన సంక్షేమ వసతి గృహ అధికారుల గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులు పోటీపడే అర్హత కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో 581 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరని తెలిపింది. దివ్యాంగుల శాఖలో కొన్ని ఉద్యోగాలకు డీఈడీ అర్హత అని పేర్కొంది. ఈ మేరకు పది కేటగిరీల ఉద్యోగాల వారీగా విద్యార్హతలను కమిషన్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
అయితే గిరిజన సంక్షేమశాఖలో గ్రేడ్-2 వార్డెన్ పోస్టుల విద్యార్హతలపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018లో గిరిజన సంక్షేమశాఖ జీవో నంబరు 45 (28-06-2011) ప్రకారం గ్రేడ్-2 వార్డెన్ పోస్టులకు డిగ్రీతో పాటు డీఈడీ లేదా బీఈడీ అర్హతగా అప్పట్లో కమిషన్ పేర్కొంది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి ఉండాలని అర్హతగా పేర్కొనడంతో ఈ పోస్టులకు డీఈడీ చేసిన అభ్యర్థులు అనర్హులవుతున్నారని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. విద్యార్హతల్ని సవరించి అందరికీ అవకాశమివ్వాలని టీఎస్‌పీఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖను అభ్యర్థిస్తున్నారు.