తెలంగాణ

telangana

ETV Bharat / state

Lashkar Bonalu: లష్కర్ బోనాలు.. పోటెత్తిన భక్తులు.. ప్రముఖుల సందర్శనలు - ఉజ్జయిని బోనాలు తాజా వార్తలు

Lashkar Bonalu: బంగారు బోనాలు.. పోతురాజు విన్యాసాలు.. సాంప్రదాయదుస్తుల్లో ముత్తైదువులు.. ప్రముఖుల సందర్శనలు.. పోటెత్తుతున్న భక్తులతో.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. రెండ్రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

Lashkar Bonalu
Lashkar Bonalu

By

Published : Jul 17, 2022, 4:41 AM IST

Updated : Jul 17, 2022, 2:29 PM IST

లష్కర్ బోనాలు.. పోటెత్తిన భక్తులు.. ప్రముఖుల సందర్శనలు

Lashkar Bonalu: ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. శాఖలు సమర్పించి.......విశేష నివేదన చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి తొలి బోనం సమర్పించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని వెల్లడించారు.

ప్రముఖుల సందర్శన..

పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఆలయం ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉదయం 9 గంటల నుంచి ఆలయానికి వీఐపీల తాకిడి మెుదలవ్వగా.. ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఉజ్జయినీ అమ్మవారికి మెుక్కులు చెల్లించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి కావ్యరెడ్డి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు బోనాల పండగు శుభాకాంక్షలు తెలిపిన కిషన్‌ రెడ్డి.. భారత్‌ విశ్వగురువు స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఉజ్జయిని అమ్మవారిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాణిక్యం ఠాగూర్‌, అంజనీ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. రేవంత్‌ రెడ్డి వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రాగా... పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రకృతి విపత్తుల నుంచి అమ్మవారు ప్రజలను కాపాడుతుందని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 2 వేల మందితో బోనాల ర్యాలీ నిర్వహించారు. ఆదయ్యనగర్ నుంచి మహంకాళి ఆలయం వరకు చేపట్టారు. భారీ ర్యాలీగా వచ్చి అమ్మవారికి కవిత బంగారు బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు గుర్తింపు వచ్చిందని కవిత అన్నారు.

రెండురోజులపాటు జ‌రిగే ఉత్సవాల్లో తొలిరోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం ఉంటుంది. భ‌క్తులు అమ్మవారికి బోనంతో పాటు సాక‌ను స‌మ‌ర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన ప‌దార్థాల‌ను ఇంట్లో త‌యారు చేసుకొని.. ఓ బండిలో పెట్టుకుని ఊరేగిస్తూ వ‌చ్చి.. అమ్మవారికి స‌మ‌ర్పించి మిగిలిన‌ది మ‌హా ప్రసాదంగా అంతా సేవిస్తారు. వాటినే ఫ‌ల‌హార బండ్లు అంటారు. బోనాల ఉత్సవంలో మరో ప్రధాన ఆక‌ర్షణ తొట్టెల ఊరేగింపు. రంగురంగుల అట్టల‌తో త‌యారు చేసిన తొట్టెల‌ను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులు అమ్మవారికి మొక్కుతీర్చుకుంటున్నారు. డ‌ప్పు చ‌ప్పుళ్లకు అనుకూలంగా నృత్యం చేస్తూ పోతురాజులు భ‌క్తుల‌ను భ‌క్తి పార‌వ‌శ్యంతో ముంచెత్తనున్నారు.

జాతర ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. 3,500 మంది పోలీసులకు విధులు కేటాయించారు. షీటీమ్స్​ను అందుబాటులో ఉంచారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరో సుమారు 300ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్బంగా ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 17, 2022, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details