తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతర' దున్నపోతు కోసం రెండూళ్ల గొడవ.. పోలీసుల తీర్పు అదుర్స్! - ఏపీ తాజా వార్తలు

Two Villagers Fighting for Bull : ఆ దున్నపోతు ఊరుమ్మడి ఆస్తి. ఏటా జాతరలో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు బలివ్వడం అక్కడి సంప్రదాయం. తీరా జాతర సమీపిస్తున్న సమయంలో దున్నపోతు కనిపించలేదు. పక్క గ్రామస్థులు బంధించారని తెలిసి గ్రామస్థులు గొడవకు దిగారు. దున్నపోతు మాదంటే.. మాదంటూ సమరానికి సిద్ధమయ్యారు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Two villagers are fighting for a bull
రెండూళ్లు దున్నపోతు కోసం గొడవ పడ్డారు

By

Published : Jan 13, 2023, 5:42 PM IST

Two Villagers Fighting for Bull : గ్రామ దేవతకు బలివ్వడానికి ఆ రెండూళ్ల ప్రజలు ఏడాది కిందట రెండు చిన్న దూడలను గ్రామంలో విడిచిపెట్టారు. అది ఆ ప్రాంత ప్రజల ఆనవాయితీ. పెరిగి పెద్దయ్యాక అందులో ఒకటి కనిపించకపోగా, మరొక దానిని గ్రామస్థులు బందెల దొడ్డిలో బంధించారు. దీంతో రెండో గ్రామ ప్రజలు "అది మాదే.." అంటూ ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో రెండు గ్రామాల మధ్య నెలకొన్న దున్నపోతు గొడవ తీవ్ర ఉత్కంఠకు తెర తీసింది. గ్రామస్థుల సెంటిమెంట్ కావడంతో సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించడానికి చివరకు ఆ జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రజలు :ఆంధ్రప్రదేశ్​లోనిఅనంతపురం జిల్లా కణేకల్ మండలం అంబాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య అమ్మవారి దున్నపోతు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంబాపురంలో ఈ నెల 17న దేవర జాతర జరిపించాలని గ్రామ పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. వచ్చే ఏడాది రచ్చుమర్రి గ్రామంలో జాతర జరగనుండగా.. తమకు అందుబాటులో ఉన్న దున్నపోతును అంబాపురం వాసులు బందుల దొడ్డిలో బంధించారు. అయితే, ఆ దున్నపోతు తమ గ్రామానికి చెందినదంటూ రచ్చుమర్రి వాసులు ఆందోళనకు దిగడంతో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఎవ్వరూ రాజీ పడకపోవడంతో కనేకల్ పోలీసులకు సమాచారం అందింది.

ఎస్పీని కలిసి.. ఏఎస్పీతో విన్నవించి..:దున్నపోతును వదులుకునేందుకు రెండు గ్రామాల ప్రజలూ ఇష్టపడకపోవడంతో పోలీసుల సైతం చేతులెత్తేశారు. దీంతో రచ్చుమర్రి వాసులు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను కలిసి సమస్యను వివరించారు. మరోవైపు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన "స్పందన" కార్యక్రమంలో ఏఎస్పీ నాగేంద్రుడిని కలసి వినతిపత్రం అందజేశారు. తమ గ్రామానికి చెందిన అమ్మవారి దున్నపోతును ఎలాగైనా తమకు ఇప్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలంటూ కల్యాణదుర్గం డీఎస్పీ, రాయదుర్గం రూరల్ సీఐకి ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో బుధవారం కణేకల్ పోలీస్​స్టేషన్ ఆవరణలో ఇరు గ్రామాల ప్రజలతో పంచాయితీ పెట్టారు.

ఎట్టకేలకు తెర :రచ్చుమర్రి, అంబాపురం గ్రామాల ప్రజల నడుమ రాయదుర్గం సీఐ యుగంధర్ అంగీకారం కుదిర్చారు. అంబాపురంలో ఈ నెల 17న జాతర ఉన్నందున ముందుగా దున్నపోతును వారికి అప్పగించాలని కోరారు. రచ్చుమర్రి గ్రామంలో జాతరకు ఏడాది సమయం ఉండడంతో మరో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం గ్రామస్థులు సహకరించాలని తీర్మానించారు. అందుకు అవసరమైన డబ్బులు చెల్లించాలని అంబాపురం గ్రామ పెద్దలకు సూచించారు. దీంతో వారం రోజులుగా సాగుతున్న దున్నపోతు వివాదానికి తెరపడింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details