ప్రపంచంలోనే ధనిక ధార్మిక సంస్థగా గుర్తింపు పొందిన తితిదే... కరోనా ప్రభావంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో తితిదేకు వివిధ మార్గాల్లో సమకూరే దాదాపు రూ.రెండు వేల కోట్ల ఆదాయానికి గండిపడింది. 75 నుంచి 80 వేల మందికి దర్శనాలు చేయించే స్థాయిలో మౌలిక వసతులు ఉన్నా... కరోనా ప్రభావంతో రోజుకు పదమూడు వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఫలితంగా హుండీ, తలనీలాలు, భక్తుల వసతిగృహాల అద్దెలు, లడ్డూ విక్రయాలు వంటి మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉంది.
కరోనా నుంచి బయటపడి సాధారణ పరిస్థితులు నెలకొనడం ద్వారా పూర్తి స్థాయిలో భక్తులను దర్శనాలకు అనమితిస్తే తప్ప తితిదే ఆదాయం తిరిగి పట్టాలెక్కే అవకాశం లేదు. సగటున నెలకు రూ.250 నుంచి 280 కోట్ల ఆదాయం ఉన్న తితిదేకు గత ఏడు నెలల కాలంలో ఖజానాకు చేరింది నామమాత్రమనే చెప్పాలి. ఆదాయ మార్గాలు మూసుకుపోగా....ఉద్యోగుల జీత భత్యాలు, ఆలయాల నిర్వహణ ఖర్చులు యథాతథంగా ఉన్నాయి. కరోనా ప్రభావం ఉద్యోగులు, అర్చకులపై పడకుండా తీసుకుంటున్న రక్షణ చర్యలతో నిర్వహణ వ్యయం మరింత పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3309 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించగా...ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికాలు ఎలాంటి ఆదాయం లేకుండా గడచిపోయాయి. మరో మూడు నెలల్లో బడ్జెట్ అంచనాలను చేరుకోవడానికి ఎలాంటి విధానాలను అనుసరిస్తారన్నది చర్చ సర్వత్రా సాగుతోంది.
ఆదాయాలు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లతో పాటు ఇతర వ్యయాల కోసం సగటున నెలకు రూ.120 నుంచి 140 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఈవోకు ఆదాయ, వ్యయాలను సమన్వయం చేస్తూ ఆర్థిక సమస్యల నుంచి తితిదేను గట్టెక్కించడం ప్రధాన సవాలు కానుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్, విరామ సమయ దర్శనాలు మాత్రమే కొనసాగిస్తుండటంతో సామాన్యులకు శ్రీవారిని దూరం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో సర్వదర్శనాలను పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వడం కష్టం కానుంది. గడచిన ఏడు నెలలుగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలు ప్రతి ఉత్సవం....ఏకాంతంగా నిర్వహించారు.