హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. సమ్మెపై నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. కార్మిక సంఘాల నాయకులపై అపోహాలు సృష్టించి... కార్మికులను దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆర్టీసీ ఐకాస నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని పేర్కొన్న ఐకాస నేతలు... సంస్థ ఆస్తులను కొల్లగొట్టెందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వేలకోట్ల పన్ను కడితే... ఆర్టీసీకి లాభాలెలా వస్తాయని ప్రశ్నించారు. సంస్థ ఆస్తులను కాజేసి ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఐకాస నేతలు దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద దీక్షలు
అంతకుముందు.. ఆర్టీసీ మహిళా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పలుచోట్ల గవర్నర్, రాష్ట్రపతిలకు కార్మికులు లేఖలు రాశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ.. పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట డిపోల ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్షకు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌లోని డిపో ఎదుట కార్మికుల దీక్షా శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం... ధూంధాం పాటలతో దద్దరిల్లింది.
కమిటీ నివేదిక సిద్ధం