తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులకు ఆర్టీసీ మరో వాత.. ఆ ఛార్జీలు రూ.10 పెంపు - bus pairs hike

ప్రయాణికులకు ఆర్టీసీ వరుస షాకులిస్తోంది. ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ప్రయాణికులకు ఛార్జీల పెంపును వడ్డిస్తున్న ఆర్టీసీ.. మరో భారం వేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలను పెంచేసింది. గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచింది.

ప్రయాణికులకు ఆర్టీసీ మరో వాత.. ఆ ఛార్జీలు రూ.10 పెంపు
ప్రయాణికులకు ఆర్టీసీ మరో వాత.. ఆ ఛార్జీలు రూ.10 పెంపు

By

Published : Apr 16, 2022, 5:00 AM IST

ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ మరో వాత పెట్టింది. రిజర్వేషన్‌ చేసుకునే వారిపై అదనంగా రూ.10 భారం మోపింది. ఇటీవల ఆర్టీసీ.. డీజిల్‌ సెస్‌, టోల్‌ ట్యాక్స్‌ వ్యత్యాసం భర్తీ, దగ్గర రూపాయికి సవరింపు పేరుతో అదనపు భారాన్ని మోపిన విషయం తెలిసిందే. తాజాగా సర్వీసు ఛార్జీని కూడా పెంచింది. రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికుల నుంచి సర్వీస్‌ ఛార్జీ రూపంలో ఒక్కో టికెట్టుపై రూ.20 వసూలు చేసేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30కి పెంచింది. ఈ పెంపుదల ఇటీవలనే అమలులోకి వచ్చింది. డీజిల్‌ ఛార్జీలు అనూహ్యంగా పెరగటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతోంది. దీంతో ఏదో ఒక రూపంలో ఛార్జీలను పెంచి నష్టాలను పూడ్చుకోవాలని సంస్థ భావిస్తుండగా.. వివిధ రకాల పెంపుదలతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ఛార్జీల పెంపు..!
ప్రయాణ ఛార్జీల పెంపునకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. పెంపుదలకు సంబంధించి అధికారులు 4 నెలల క్రితమే మూడు రకాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఆ తరవాత కూడా డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుత డీజిల్‌ ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని కిలోమీటరుకు కనీసం 20 పైసల చొప్పున పెంచాలని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో నిమగ్నమవడంతో ఛార్జీల పెంపు విషయంపై దృష్టి పెట్టలేదని, త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశముందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details