TSPSC Exams Dates Announced : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ సందర్భంగా వాయిదా పడిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు కొత్త తేదీలు వచ్చాయి. ఈ మేరకు రెండు పరీక్షలకు కొత్త తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. జులై 8న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను, జులై 13,14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. అలాగే పరీక్షకు వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
గత మార్చి నెలలో వాయిదా పడిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు జూలై నెలలో జరగనున్నాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రూపంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసులో 31 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరి వద్ద నుంచి సిట్ అధికారులు వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు. అయితే వీరిలో కొందరికి బెయిల్ కూడా మంజూరు అయింది.
తమ భార్యలతో పరీక్షలు రాయించిన ఇద్దరు నిందితులు : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. గతంలో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులు.. వారు సేకరించిన పేపర్లతో తమ తమ భార్యలతో పరీక్షలు రాయించినట్లు సిట్ అధికారుల విచారణలో బహిర్గతమైంది. వారితో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. కమిషన్ నెట్‌వర్క్ విభాగ ఇంఛార్జిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత, రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నపత్రం పరీక్షను రాసినట్లు సిట్ గుర్తించింది.
ఈ కేసులో మరో నలుగురు అరెస్ట్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేణుక రాథోడ్‌కు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాహుల్‌కు పాత పరిచయం ఉండడంతో అతని వద్ద అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం తీసుకొని.. పరీక్ష రాసినట్లు ఉందని సిట్ గుర్తించింది. అలాగే నాగార్జున సాగర్‌కు చెందిన రమావత్ దత్తు.. ఢాక్యానాయక్ నుంచి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. అతనిని కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే.. వీరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో నలుగురిని అరెస్ట్ చేసి సిట్ అధికారులు.. రిమాండ్‌కు తరలించారు.
ఏ2 రాజశేఖర్ రెడ్డి బెయిల్ తిరస్కరణ : ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.. దీనిపై గురువారం విచారణ జరిపిన కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.
ఇవీ చదవండి :