ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేర్చుకుంటే.. సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగరావు, సునీల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ప్రసాద్... అదనపు ఏజీ రాంచందర్ రావు, ఆర్టీసీ ఈడీలతో ప్రగతి భవన్‌లో సీఎం 4 గంటలకు పైగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై... విస్తృతంగా చర్చించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా సమీక్షించారు.
ఐదువేల కోట్లకు పైగా అప్పులు..
ఆర్టీసీకి ఇప్పటికే ఐదువేల కోట్లకు పైగా అప్పులున్నాయని.. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రెండు వేల కోట్ల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు. భవిష్యనిధి అధికారుల ఆదేశం మేరకు... ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ. 240 కోట్లు అవసరమని... సీసీఎస్కు రూ. 500 కోట్లతో పాటు డీజిల్ బకాయిలు చెల్లించాలని అన్నారు. ఆర్టీసీ రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉందని... పీఎఫ్ బకాయిల కింద నెలకు 65 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. కాలం చెల్లిన 2వేల 600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉందని అన్నారు. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాలని వివరించారు. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదని... ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సమావేశం తేల్చింది.