కాంగ్రెస్ పార్టీ చలో సచివాలయం పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు... ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలను ఇంటికే పరిమితం చేస్తూ గృహనిర్బంధంలో ఉంచారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి సహా అనేక మంది సీనియర్ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మెహరించారు. భట్టి విక్రమార్క బయటకు వెళ్లేందుకు రాగా... అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని మళ్లీ ఇంట్లోకి పంపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు, శ్రీధర్‌బాబులను ముందస్తు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ చలో సచివాలయంపై ఉక్కుపాదం.. నేతల నిర్బంధం - ts congress leaders
09:20 June 11
కాంగ్రెస్ చలో సచివాలయంపై ఉక్కుపాదం.. నేతల నిర్బంధం
ప్రభుత్వంపై సీఎల్పీ నేత ఫైర్
మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సచివాలయం ముట్టడికి పిలుపునివ్వలేదని... కేవలం సీఎంను కలిసి వినతి పత్రం ఇస్తామన్నా... పోలీసులు నిర్బంధించారని ఆయన విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి... తమను కలిసేందుకు అవకాశం ఇచ్చినా... పోలీసులు మాత్రం బయటకు వెళ్లనీయకుండా గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. పోలీసులు సమాచార లోపంతో ఇలా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్... ఓ పెళ్లికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయటకు రావడంతో... పోలీసులు ఆదర్శనగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ నిరంకుశపాలన సాగిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటి అద్దె కూడా చెల్లించొద్దు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు స్లాబుల పేరుతో అధిక బిల్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
కష్టకాలంలో ప్రజలపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకని కోమటిరెడ్డి ప్రశ్నించారు. 3 నెలలుగా ఉపాధి లేని ప్రజలు అధిక బిల్లుల భారాన్ని ఎలా భరిస్తారని అడిగారు. ప్రజాసమస్యలపై పోరాడితే అరెస్టు చేయిస్తారా.. ఇదెక్కడి న్యాయమని అన్నారు.