తెలంగాణ

telangana

ETV Bharat / state

సెప్టెంబరు నుంచి టీఎస్‌-బీపాస్‌

తెలంగాణలోని పురపాలక పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు టీఎస్‌-బీపాస్‌ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. సులభంగా, సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడమే లక్ష్యంగా పురపాలకశాఖ దీనిని రూపొందించింది.

సెప్టెంబరు నుంచి టీఎస్‌-బీపాస్‌
సెప్టెంబరు నుంచి టీఎస్‌-బీపాస్‌

By

Published : Aug 26, 2020, 6:59 AM IST

రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతులకు టీఎస్‌-బీపాస్‌ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. సులభంగా, సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడమే లక్ష్యంగా పురపాలకశాఖ దీనిని రూపొందించింది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన ఈ విధానాన్ని సెప్టెంబరు రెండో వారంలోగా అమలు చేయాలని పురపాలకశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన సాంకేతిక అంశాలను కొలిక్కి తెస్తోంది. సాంకేతిక సంస్థ ఎంపికను కూడా పూర్తిచేసింది. టీఎస్‌-బీపాస్‌ను జూన్‌ 1 నుంచే అమలుచేయాలని ముందు భావించినా మంత్రిమండలి ఆమోదం తర్వాతే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యాంశాలు

* భవన నిర్మాణాలతో పాటు లేఅవుట్లకు టీఎస్‌-బీపాస్‌ విధానంలో అనుమతులు లభించనున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

* పది మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకునే వ్యక్తిగత భవనాలకు పురపాలక కార్యాలయాలకు వెళ్లకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లోనే నిర్మాణ అనుమతులు పొందవచ్చు.

* అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసి రుసుం చెల్లిస్తే 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతి వస్తుంది. 21 రోజుల్లో అనుమతి రానిపక్షంలో, వచ్చినట్లుగానే భావించి దరఖాస్తుదారులు ముందుకు వెళ్లవచ్చు.

* దరఖాస్తుతో పాటు నిర్దేశించిన సమాచారం, అవసరమైన పత్రాలు ఇవ్వకుంటే.. 15 రోజుల గడువు ఇస్తారు. ఆలోగా వీటిని ఆన్‌లైన్‌లో ఇవ్వకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు.

* 75 చదరపు గజాల (63 చదరపు అడుగులు) వరకు ఒక అంతస్తు వరకు ఎలాంటి నిర్మాణ అనుమతి అవసరం లేదు. ఇలాంటి భవనాలను ఒక రూపాయి రుసుం చెల్లించి విధిగా టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* తప్పుడు ధ్రువపత్రాలు అందచేసినా, మాస్టర్‌ప్లాన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, తప్పుడు సమాచారం ఇచ్చినా పురపాలక చట్టం మేరకు అనుమతి రద్దు చేసి వాటిని కూల్చివేస్తారు.

ఇదీ చదవండి:ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!

ABOUT THE AUTHOR

...view details