TRS Vijayagarjana: తెరాస విజయగర్జన సభ వాయిదా... ఎందుకంటే? - Trs meeting postponed
20:24 November 01
వరంగల్‌లో జరగనున్న తెరాస విజయగర్జన సభ వాయిదా
తెరాస ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను పార్టీ వాయిదా వేసింది. ఈనెల 29న దీక్షా దివస్ రోజున విజయ గర్జన నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సుమారు పది లక్షల మందితో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కొన్ని రోజులుగా తెరాస ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్‌లో సభ స్థలిని పరిశీలించి సమావేశమయ్యారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29న తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తే బాగుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కేసీఆర్కు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దీక్షా దివస్ను దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ విజయ గర్జన సభను జరపాలన్న వరంగల్ జిల్లా నేతల వినతి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ నేతలు సభ వాయిదాను గమనించాలని కేసీఆర్ కోరారు. బస్సులు తదితర రవాణా ఏర్పాట్లను ఈనెల 29వ తేదీకి మార్చుకోవాలని.. సభా తేదీ మార్పును క్షేత్రస్థాయి కార్యకర్తలకు వివరించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Ktr on Vijaya Garjna: 'విజయగర్జనను మరిచిపోలేని విధంగా నిర్వహిద్దాం'