మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు తెరాసకు సవాల్‌గా మారింది. ఒక్కో వార్డు నుంచి దాదాపు పది మంది ఆశావహులు ఉన్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు నేరుగా కేటీఆర్‌ను కలిసి కోరుతున్నారు. పనైతే చేయడంటూ అందరికీ నేతలు హామీ ఇస్తుండటంతో... అందరూ ఆశతో ఉన్నారు.
ఒక్కో స్థానం నుంచి ముగ్గురు ఎంపిక
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తెప్పించుకున్న నివేదికల్లోనూ... అసమ్మతి సెగలు ఉండే అవకాశం ఉందని అధిష్ఠానానికి హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారైతే.. కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉండనుంది. రిజర్వ్ స్థానాల్లోనూ పోటీ తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో వార్డు, డివిజన్ నుంచి.. ఒక్కో రిజర్వేషన్ కేటగిరీలో ముగ్గురు పేర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల్లోనూ చురుకైన నేతలు ఉంటే వారికి కూడా చివరి నిమిషంలో గులాబీ కండువా కప్పాలని ఆలోచిస్తున్నారు.