తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ పోరు... వందకుపైగా సీట్లు గెలిచేలా తెరాస వ్యూహాలు - జీహెచ్​ఎంసీ ఎన్నికలపై టీఆర్​ఎస్​ వ్యూహం

గ్రేటర్ ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలపై దృష్టి పెట్టాయి. అధికార తెరాస పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. వందకు పైగా స్థానాల్లో విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమాతో ఉంది. దుబ్బాక ఫలితం, వరద కష్టాలు, లాక్ డౌన్ ఇబ్బందులు... అవరోధాలు కాబోవని చెబుతోంది. మినీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో జరగనున్న గ్రేటర్ పోరులో పార్టీ ముఖ్యనేతలందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

trs
trs

By

Published : Nov 17, 2020, 9:09 PM IST

గ్రేటర్​ పోరు... వందకుపైగా సీట్లు గెలిచేలా తెరాస వ్యూహాలు

గ్రేటర్ పీఠంపై మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు తెరాస వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న గులాబీ పార్టీ.. ఈసారి కూడా అదే స్థాయి గెలుపుపై ధీమాతో ఉంది. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తున్న జీహెచ్ఎంసీ పోరు కోసం కొన్ని నెలల నుంచి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ముందస్తు, సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్ల వంటి ఎత్తులతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాల్లో తెరాస గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన అంశాలుగా ముందుకెళ్తామని ఆ పార్టీ స్పష్టంచేస్తోంది.

సిట్టింగ్​లకే టికెట్లు!

పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్... కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్‌పై పూర్తి దృష్టి సారించారు. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల పెట్టుడులు, ఐటీ రంగం అభివృద్ధిపై కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితులను అవకాశంగా మలుచుకొని రహదారులు, ఇతర పనులు వేగంగా చేపట్టారు. ఆరేళ్లుగా కర్ఫ్యూ లేని నగరం... తమ ఘనతేనని తెరాస చెబుతోంది. ఇప్పటి వరకు ఏం చేశారో వివరిస్తూ... భవిష్యత్తులో ఏం చేయాలో చెబుతూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​లకే మళ్లీ టికెట్లు కట్టబెట్టిన తెరాస.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో సిద్ధమైంది. అందులో భాగంగానే మరో ఐదేళ్లపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తూ జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించినట్లు తెలుస్తోంది.

వరద 'సాయం' చేస్తుందా?

కొన్ని నెలల క్రితం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సుమారు పదిహేను, ఇరవై మంది పనితీరు బాగా లేదని.. మార్చుకోవాలని అప్రమత్తం చేశారు. లాక్ డౌన్ ఇబ్బందుల్లో కార్పొరేటర్లు భాగస్వామ్యమయ్యేలా పురమాయించారు. జీహెఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఇవన్నీ చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి, వరద కష్టాల ప్రభావం పడకుండా తెరాస జాగ్రత్త పడుతోంది. వరద బాధితులకు పంపిణీ చేసిన రూ.10వేల ఆర్థిక సాయం తమకు అనుకూలంగానే ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వరద సాయం అందని వారందరికీ పోలింగ్ సమయానికి అందేలా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్​

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి అక్కడి స్థానిక పరిస్థితులు, కొంత అతివిశ్వాసం కారణమని భావిస్తున్న తెరాస.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆ ప్రభావం ఉండదని విశ్వసిస్తోంది. ఇప్పటి వరకు వివిధ కోణాల్లో ఐదారు సర్వేలు చేయించిన తెరాస.. ఎటు చూసినా విజయం తమదేనన్న ధీమాతో ఉంది. అయినప్పటికీ అతివిశ్వాసం ప్రదర్శించవద్దని ముఖ్యనేతలకు పార్టీ నాయకత్వం చెబుతోంది. కేటీఆర్‌ సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య శ్రేణులను గ్రేటర్‌ ప్రచార బరిలోకి దించేందుకు సిద్ధం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్ బాధ్యత అప్పగించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేయనున్నారు.

ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ!

అభ్యర్థులను కేటాయించిన తర్వాత అసంతృప్తులు, అసమ్మతులకు విపక్షాలు గాలం వేసే అవకాశం ఉన్నందున... వారిని బుజ్జగించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కచ్చితంగా వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామంటున్న తెరాస.. మేయర్ స్థానం కోసం అన్ని కోణాల్లోనూ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎంఐఎంతో స్నేహపూర్వక సంబంధం ఈ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. తెరాస 150 డివిజన్లలో అభ్యర్థులను నిలబెడుతున్నప్పటికీ.. దాదాపు 50 స్థానాల్లో మజ్లిస్‌తో స్నేహపూర్వక పోటీనే ఉంటుంది.

కేటీఆర్ రోడ్​షో

ఎంఐఎంకు సుమారు 45 నుంచి 50 సీట్లు రావచ్చునని భావిస్తున్న తెరాస.. అవసరమైతే మేయర్ స్థానానికి సహకారం తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో సీఎం కేసీఆర్ చర్చించారు. అవసరమైతే కోఆప్షన్ ఓట్లను కూడా వినియోగించుకునేందుకు వీలుగా ఖాళీగా ఉన్న శాసనమండలి నామినేటెడ్‌ సీట్లను భర్తీ చేసింది. సామాజిక సమతూకం పాటిస్తూ.. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌ను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా నియమించింది. స్థానిక అంశాలు, అభివృద్ధి, సంక్షేమాలతో ప్రచారం చేయడానికి తెరాస ప్రణాళికలు రచిస్తోంది. కేటీఆర్ రోడ్ షోలు చేయనున్నారు. కేసీఆర్ ప్రచారం నిర్వహించాలా వద్దా అనే అంశంపై... ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి :రేపు తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్ష సమావేశం

ABOUT THE AUTHOR

...view details