తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Plenary: ఏడేళ్లలో సమగ్రాభివృద్ధి.. అన్ని వర్గాల అభ్యున్నతి: కేసీఆర్ - ఏడేళ్లలో అద్భుత ప్రగతి

ఏడేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో మనం కీర్తి బావుటా ఎగురవేశామని కొనియాడారు. హైదరాబాద్​లోని హైటెక్స్​లో తెరాస ప్లీనరీ సభను ఘనంగా నిర్వహించారు. దళితబంధును ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

TRS Plenary
తెరాస ప్లీనరీలో సీఎం కేసీఆర్

By

Published : Oct 26, 2021, 5:15 AM IST

Updated : Oct 26, 2021, 8:15 AM IST

‘అవహేళనలు, అగమ్యగోచరమైన పరిస్థితుల మధ్య సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అద్భుత ప్రగతిని సొంతం చేసుకుంది. అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. తెలంగాణను తలెత్తుకునేలా చేసిన పార్టీ తెరాస. సమాజంలో చిరునవ్వే మా లక్ష్యం’ అని ముఖ్య మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయన్న అపోహలను అభివృద్ధితో పటాపంచలు చేశామని చెప్పారు. దేశ, విదేశాల్లో మన ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నామన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ మతమని.. సమస్యల పరిష్కారమే అభిమతమని స్పష్టం చేశారు. దళితబంధును రాష్ట్రమంతటికీ విస్తరిస్తామన్నారు. ఇతర వర్గాల్లోని పేదలను ఆదుకోవడానికి ఇలాంటి కార్యాచరణ ఏడాదిలోగా చేపడతామన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి ఒక్కరితో సాధ్యమైంది కాదని, ప్రజాప్రతినిధులందరి కృషి ఫలితమని తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం జరిగిన తెరాస ప్లీనరీ సభలో కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేశారు.

ప్రజలే కేంద్ర బిందువుగా, వారి అవసరాలే లక్ష్యంగా ముందుకు సాగే ఏకైక పార్టీ తెరాస. మాకు ప్రజలే అధిష్ఠానం. జనం ఆకాంక్షలే ఎజెండా పార్టీ అధ్యక్షుడిగా మీరు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తా. పార్టీ గౌరవాన్ని పెంచడానికే నా జీవితాన్ని అంకితం చేస్తా.

‘దళితబంధును కాంగ్రెస్‌, భాజపాలు అమలు చేయగలుగుతాయా? దిల్లీ పాలకులు అనుమతి ఇస్తారా? 75 ఏళ్ల పాలనలో అవకాశమిచ్చినా వాళ్లెందుకు ఆలోచన చేయలేదు? ప్రజలను ఓటు బ్యాంకులుగా భావించి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందారు తప్ప, శాశ్వత పరిష్కారం చేయలేదు. దళితబంధు రూ.1.70 లక్షల కోట్ల వ్యర్థం కాదు... ఇది రూ. 10 లక్షల కోట్ల ఆస్తి అవుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. దళితబంధు లాంటి పథకం ఇచ్చే శక్తి తెరాసకే ఉంది’.

- సీఎం కేసీఆర్‌

అభివృద్ధిలో మిన్న
‘‘అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మిన్నగా ఉంది. తలసరి విద్యుత్‌వినియోగంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా తలసరి ఆదాయంలో మొదటి, రెండు రాష్ట్రాలతో సమానంగా ఉన్నాం. లాక్‌డౌన్‌, కరోనా వంటి పరిస్థితుల్లోనూ 11.5 శాతం వృద్ధిరేటుతో అగ్రగామిగా నిలిచాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాం. ఆర్థికరంగంలో తెలంగాణ పురోగమిస్తోందని సగర్వంగా చెబుతున్నాను. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ అద్భుతంగా జరిగింది. నేడు పంజాబ్‌ను తలదన్ని 3 కోట్ల టన్నుల ధాన్యం పండించాం. ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని పథకాల అమలుకు ఆదాయం ఎలా అని అడుగుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లనుంచి లక్ష కోట్లకుపైగా పెరిగాయి. 2028 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.4.28 లక్షల కోట్లుగా ఉంటుంది. ఏడేళ్లలో రూ. 23 లక్షల కోట్లు వ్యయం చేయనున్నాం. తలసరి ఆదాయం రూ.7.76 లక్షలు అవుతుంది. ఇది మనం చెబుతున్నది కాదు. కేంద్ర గణాంకశాఖే స్పష్టం చేస్తోంది. అభివృద్ధిని కేసులతో అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేసినా పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. చెరువుల్ని బాగుచేసుకున్నాం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుబీమాలాంటి పథకం లేదు. లంచంలేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నాడు ఎన్టీఆర్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తే.. నేడు వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి ధరణి అనే అద్భుత కార్యక్రమం చేపట్టాం.

పటిష్ఠంగా పార్టీ
పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉంది. రాష్ట్రం నలుదిశలా ఆదరణ పొందుతోంది. దేశ రాజధాని దిల్లీలో తెరాస భవనం ఎనిమిది, తొమ్మిది నెలల్లో పూర్తవుతుంది. 31 జిల్లా కేంద్రాల్లో పార్టీ భవనాల నిర్మాణం పూర్తయింది. త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రతి నియోజకవర్గంలోనూ భవనాల నిర్మాణం చేపడతాం. పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ప్రారంభించబోతున్నాం. పార్టీ ఆర్థికంగా కూడా బలంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీల తరహాలోనే విరాళాల ద్వారా నిధులను సమీకరించుకోగా పార్టీకి ప్రస్తుతం రూ.425 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయి. వీటిపై ప్రతి నెల వచ్చే రూ. 2 కోట్ల వడ్డీతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. 60 లక్షల మంది సభ్యత్వం పొందగా వీరందరికీ బీమా పథకం అమలు చేస్తున్నాం. ఏటా బీమా ప్రీమియం రూ.20 కోట్లు పార్టీనే చెల్లిస్తోంది.

దళితబంధు ప్రయోగశాల హుజూరాబాద్‌
ఎన్నికల కమిషన్‌ లేదా ఎవరేం చేసినా నవంబరు 4 తర్వాత దళితబంధును ఎవరూ ఆపలేరు. హుజూరాబాద్‌లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుస్తారు. అక్కడ ఆయనే దీన్ని పూర్తి చేస్తారు. హుజూరాబాద్‌ దళితబిడ్డలు అదృష్టవంతులు. అక్కడ వారికి పైలట్‌ ప్రాజెక్టు వచ్చింది. దళితబంధుకు హుజూరాబాద్‌ ప్రయోగశాల అవుతుంది. దీన్ని ఎలా అమలు చేస్తున్నారో చూసేందుకు 118 నియోజకవర్గాల అధికారులు అక్కడికి వస్తారు. మార్చి నాటికి పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరిస్తాం. ఏడేళ్లుగా రాష్ట్రంలో మంచినీరు, విద్యుత్తు, వ్యవసాయాభివృద్ధి సహా ప్రాథమిక అవసరాలు తీర్చుకుని, ఆర్థికంగా పటిష్ఠమయ్యాక స్పష్టమైన లక్ష్యం, అవగాహనతో చేపట్టిన కార్యక్రమం ఇది. అట్టడుగున ఉన్న సామాజికవర్గం, వివక్షకు గురై, ఎక్కువ జనాభా ఉండి తక్కువ అవకాశాలు, తక్కువ భూమిఉన్న దళితజాతి కన్నీళ్లు తుడిచేందుకే దళితబంధు. ఇది అంతటితోనే ఆగదు. ఈ రాష్ట్రసంపద ఎక్కడికీపోదు. మనపేదలను మనమే కాపాడుకోవాలి. గిరిజనులు, బీసీలు, ఎంబీసీలు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలుసహా అందరి అభివృద్ధికి ఏడాదిలో కార్యాచరణ రూపొందుతుంది.

ఈసీ గౌరవం నిలబెట్టుకోవాలి

భారత ఎన్నికల సంఘం (ఈసీ) రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్లు తమ పరిధిని దాటుతున్నారు. సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, బాధ్యత కల పార్టీ అధ్యక్షుడిగా, ఒక సీఎంగా ఎన్నికల సంఘానికి సలహా ఇస్తున్నా..మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి.’’ అని కేసీఆర్‌ వివరించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు తెరాస ప్లీనరీకి హాజరుకాలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రసంగంలో తెలిపారు.

ఆంధ్రాలోనూ పార్టీ పెట్టాలంటున్నారు

దళితబంధు చేపట్టిన తర్వాత, ఆంధ్ర ప్రాంతం నుంచి వందల, వేల విజ్ఞాపనలు వస్తున్నాయి. తెరాస పార్టీని ఆంధ్రలో ప్రారంభించండి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మీ పథకాలు మాకు కూడా కావాలని వారు కోరుతున్నారు. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని అయిదు నియోజకవర్గాల నాయకులు, కర్ణాటకలోని రాయచూర్‌ ఎమ్మెల్యే వారి రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏపీలో కరెంటు లేదు.. ఇక్కడ 24 గంటలూ..

తెలంగాణ విడిపోతే చీకటి అయిపోతుందని అప్పటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్‌ నుంచి మనం విడిపోయామో అక్కడ కరెంటు లేదు. తెలంగాణలో 24 గంటలూ విద్యుత్తు ఉంటోంది. ఏపీ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.37 లక్షలు.

నాడు బతకలేరని అన్నారు.. ఇప్పుడేమైంది?

తెలంగాణ ఉద్యమం ఆరంభంలో పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉండేవి. కొద్ది మందితో ప్రారంభమైన ఉద్యమం ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆగలేదు. పోరాటంలో నిజాయతీ ఉండటంతో పాటు. సరైన మార్గంలో లక్ష్యం వైపు పయనించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యం చెప్పింది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు అనేక అపోహలుండేవి. రాష్ట్రం కారుచీకట్లలో ఉంటుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని, బతకలేని పరిస్థితులుంటాయని, భూముల ధరలు పడిపోతాయని, పరిశ్రమలు తరలిపోతాయని ఎన్నోఅన్నారు.. ఇప్పుడేం జరిగింది? అభివృద్ధితో సగర్వంగా ముందుకువెళ్తున్నాం.

ఆద్యంతం ఉల్లాసంగా..ఉత్సాహంగా..

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో ఆహ్వానించినప్పటికీ సభకు భారీఎత్తున ప్రతినిధులు తరలివచ్చారు. మూడేళ్ల తర్వాత జరిగిన సభ విజయవంతం కావడం పార్టీశ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చింది. పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్‌ ఎన్నికతో పాటు కీలకమైన ఏడు అంశాలపై తీర్మానాలు, పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​లతోపాటు మంత్రులు, నేతల ప్రసంగాలతో సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఉదయం 10.30కే సభాప్రాంగణం నిండిపోయింది. 11.30కి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేదికపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పార్టీ, తెలంగాణ అమరవీరుల మృతికి సంతాపంగా నిమిషం మౌనం పాటించాక సభ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షునిగా ప్రకటించడంతో ప్రతినిధులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. దాదాపు పదినిమిషాల పాటు ఆయనను అభినందించారు. అనంతరం సీఎం ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. తెరాస ప్రస్థానం, పార్టీ పంథా, తెలంగాణ సాధన, అధికారంలోకి వచ్చాక సాధించిన విజయాలను వివరించారు.

వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ప్లీనరీలో ప్రత్యేకాకర్షణగా నిలిచారు. దళితబంధుపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. భవిష్యత్తులో ఇది బహుళ ప్రయోజనకారిగా ఎలా మారుతుంది? తదితర అంశాలను సోదాహరణంగా చెప్పారు. రోగికి వైద్యం మాదిరిగా సీఎం పథకాన్ని అవసరమైనవారికి ఎలా అమలు చేస్తారో వివరించారు. కేసీఆర్‌ ఆయనకు సమయం నిర్దేశించకుండా ఆద్యంతం విన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌ విపక్షాల తీరును ఎండగడుతూ మేక దావత్‌ పేరిట చెప్పిన కథ అందరినీ నవ్వించింది. ప్రసంగం అనంతరం సీఎం ఆయనను కరచాలనంతో అభినందించారు. కేటీఆర్‌ వేదిక మీదే ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత మాట్లాడుతూ, ఆనంద్‌ తరహాలోనే ప్రసంగించారు. సీఎం ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:

KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్

Last Updated : Oct 26, 2021, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details