రేపట్నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. రైతు సమస్యలపై పార్లమెంటు లోపల, బయటా... పోరాడతామని వెల్లడించారు. వానాకాలం ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పాలని.. యాసంగి ధాన్యం సేకరణపై స్పష్టత ఇవ్వాలని కోరినా... కేంద్రం మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. దానిపై సభలో నిలదీస్తామన్నారు.
పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న నామ... విభజన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ అఖిలపక్ష భేటీలో నామ నాగేశ్వరరావుతో పాటు బండ ప్రకాశ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ముందుకు తీసుకురానున్న బిల్లులపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేలా చూడాలని కోరినట్లు నామ తెలిపారు.
రైతులు పండించిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఎంఎస్పీ డిసైడ్ చేసింది మీరే. దీని గురించి నాలుగైదు సమావేశాల్లో చెప్పాం. యాసంగి పంటను కొనమని, వానాకాలం పంటను ఎంతకు కొంటామో చెప్పమని.. ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. పీయూష్ గోయల్ గారిని కలిసి కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం. దీనిపై తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యతతో పాటు రైతులను ఆదుకోవాల్సి బాధ్యత కూడా కేంద్రంపై ఉంది. సాగు చట్టాల రద్దుతో పాటు పలు అంశాలు రేపు పార్లమెంట్లో చర్చకు రానున్నాయి. రైతుల మీద పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కూడా చెప్పాం. -నామ నాగేశ్వరరావు, తెరాస ఎంపీ
'ధాన్యం సేకరణపై పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తాం' ఇదీ చదవండి:
TRS Parliamentary Party Meeting: ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలి: కేసీఆర్