బల్దియా ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థులు దూసుకెళుతున్నారు. ప్రచారానికి తక్కువ రోజుల వ్యవధి ఉండడంతో సాధ్యమైనంతగా ఓటర్లను నేరుగా కలుసుకునేలా ప్రణాళిక అమలుచేస్తున్నారు. రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన పనులను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బరిలో దిగారు. మేయర్ పీఠం కైవసమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
వంద సీట్లు ఖాయం
అడిక్‌మెట్ అభ్యర్థి హేమలతకు మద్దతుగా నాగమయ్య కుంట, మేడిబాయ్ బస్తీ ప్రాంతాల్లో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాంనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి... శ్రీరామ్‌నగర్, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి ఓటేయాలని అభ్యర్థించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. మంగళ్‌హాట్ డివిజన్ అభ్యర్థి పరమేశ్వరి సింగ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రచార హోరు
సికింద్రాబాద్ సెగ్మెంట్ రాంగోపాల్ పేట్ డివిజన్‌లో అధికార పార్టీ అభ్యర్థి అరుణ... మెక్లెంగూడ, చుట్టాల బస్తీ తదితరచోట్ల ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి పాదయాత్రగా వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పటాన్‌చెరు అభ్యర్థి మెట్టు కుమార్.... తనకు మద్దతిస్తే మరింత పనిచేస్తానంటూ ఓట్లు అడుగుతున్నారు. అల్వాల్ యాదమ్మ నగర్, కృష్ణ ఎనక్లేవ్ పాటు పలు కాలనీల్లో డివిజన్ ఇంఛార్జీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అభ్యర్థి విజయశాంతి ప్రచారం చేశారు.
పనులు చూసి ఓటేయండి
సికింద్రాబాద్ పరిధి బౌద్ధనగర్‌లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఉపసభాపతి పద్మారావుగౌడ్ పాదయాత్రగా వెళ్లి బస్తీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటేయాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలే తెరాసను గెలిపిస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ తెరాస అభ్యర్థి మందడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రామచంద్రాపూర్ డివిజన్‌ను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని అభ్యర్థి పుష్ప కోరారు.