కరోనా సెగ రైల్వేకు తగిలింది. తప్పనిసరైతేనే తప్ప ప్రయాణాలు చేయొద్దని వైద్య నిపుణుల సూచనతో ప్రజలు రైళ్ల ప్రయాణానికి దూరమవుతున్నారు. ఏసీ రైళ్లలో ప్రయాణించే వారు 25 శాతం తగ్గినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ప్రయాణికులు లేకపోవడం వల్ల దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 29 రైళ్లను రద్దు చేశారు.
10 లక్షలకు పడిపోయిన ప్రయాణికుల సంఖ్య
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 750 రైళ్లలో 10 లక్షల 50 వేల మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తుంటారు. కరోనా వైరస్ ప్రభావంతో నిత్య ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు పడిపోయింది.
ఏసీ కోచ్‌ల్లో 25 శాతం తగ్గింపు
దక్షిణ మధ్య రైల్వేలో నడిచే రైళ్లలో సుమారు 200 రైళ్లకు 3 నుంచి 5 ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఒక్కో కోచ్‌లో సరాసరి 50 మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ విధంగా ఏసీ కోచ్‌ల్లో దాదాపు 35 వేల నుంచి 50 వేల మంది వరకు ప్రయాణం చేస్తారు. కరోనా కారణంగా ఏసీ రైళ్లలో ప్రయాణించే వారు 25 శాతం తగ్గినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
ఇవి కాకుండా రాజధాని, శతాబ్ది, గరీబ్ రథ్ పూర్తిస్థాయిలో ఏసీ రైళ్లు. వీటిలో కూడా రిజర్వేషన్ తక్కువ శాతమే జరుగుతుందని రైల్వే శాఖ తెలిపింది. స్లీపర్ కోచ్‌ల్లో గతంలో 200 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంటే.. ఇప్పుడు 50-70 శాతానికి పడిపోయింది. ఏసీ కోచ్‌ల్లో 50 నుంచి 60 వెయిటింగ్ లిస్ట్ ఉంటే.. ఇప్పుడు పదికి మించి లేదంటున్నారు.
రద్దయిన రైళ్లు ఇవే
- ముంబాయి-ఎల్.టీ.టీ-అజ్నీ (ఎగువ,దిగువ)
- ముంబాయి ఎల్.టీ.టీ-కరీంనగర్(ఎగువ,దిగువ)
- ముంబాయి సీఎస్టీ-నాగ్ పూర్(ఎగువ,దిగువ)
- కాలబుర్గి(గుల్బర్గ)-హైదరాబాద్(ఎగువ,దిగువ)
- చెన్నయ్-సికింద్రాబాద్ (ఎగువ,దిగువ)
- సంత్రగచ్చి-చెన్నయ్ (ఎగువ,దిగువ)
- కాకినాడ టౌన్-లింగంపల్లి(ఎగువ, దిగువ)
- మచిలీపట్నం-సికింద్రాబాద్ (ఎగువ,దిగువ)
- హైదరాబాద్-ఎర్నాకులం(ఎగువ,దిగువ)
- హైదరాబాద్-విజయవాడ
- తిరుచిరపల్లి-హైదరాబాద్(ఎగువ,దిగువ)
- హెచ్.ఎస్ నాందేడ్-ఔరంగాబాద్(ఎగువ, దిగువ)
- ఔరంగాబాద్-రేణిగుంట(ఎగువ, దిగువ)
- తిరుపతి-చెన్నయ్ సెంట్రల్(ఎగువ,దిగువ)
- కాన్పూర్ సెంట్రల్-కాచిగూడ(ఎగువ,దిగువ)
కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు
ఇదీ చూడండి:ఆర్బీఐ అభయంతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు