ప్రస్తుతం సాంకేతిక యుగంలో కోడింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే కాకుండా మరెన్నో ఇతర రంగాల్లో స్థిరపడాలనుకునే యువతకు కోడింగ్ తప్పనిసరి. ఎంతో మంది యువత ఉద్యోగసాధనలో భాగంగా నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు(Training in coding). ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం కోడింగ్ నేర్చుకోనున్నారు. తెలంగాణ విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్(LLF), డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థుల్లోని సృజనను వెలికితీసేందుకు వీలుగా ‘స్టెమ్’(Science, technology, engineering, maths) ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా కిట్లు అందించనున్నారు.
ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వీలుగా
కోడింగ్‌తోపాటు ప్రయోగాలు చేయించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో రెండు జిల్లాల్లో చెరో 20 చొప్పున ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మరో పది తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ బడులున్నాయి. వాటిల్లో చదివే ఆరు నుంచి పదో తరగతి పరిధిలోని 20వేల మంది విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీంద్రరావు, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త ఎస్.రజిత, డెల్ కంపెనీ సైట్ హెడ్ సిద్ధార్థ్ సిన్హా, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మేనేజింగ్ పార్ట్‌నర్ నురియా అన్నారి సంయుక్తంగా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.