తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యూఇయర్​ వేడుకలకు సిద్ధమవుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!

New Year Restrictions in Hyderabad : కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే.. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకల వేళ రేపు నగరం​లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పరిధిలో శనివారం రాత్రి 10 నుంచి ఎల్లుండి తెల్లవారుజాము వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

New Year Restrictions
New Year Restrictions

By

Published : Dec 30, 2022, 4:09 PM IST

New Year Restrictions in Hyderabad : న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు వివరాలను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రాఫిక్‌ ఆంక్షల సమయంలో ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.

లిబర్టీ కూడలి, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. మింట్‌ కాంపౌండ్‌ రోడ్డును మూసివేయనున్నారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్‌ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై డిసెంబర్‌ 31 రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని సీపీ సీవీ ఆనంద్‌ కోరారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో..:నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 31న సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు డీసీపీ (ట్రాఫిక్‌) శ్రీనివాస్‌రావు తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్‌పైనా ఆ నిబంధనలే అమల్లో ఉంటాయి. గచ్చిబౌలి శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ పార్కు ఫ్లైఓవర్‌ లెవెల్‌ 1, 2, షేక్‌పేట ఫ్లైఓవర్‌, మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌, రోడ్‌ నం.45 ఫైఓ్లవర్‌, దుర్గం చెరువు తీగల వంతెన, సైబర్‌ టవర్‌ ఫ్లైఓవర్‌, ఫోరం మాల్‌ ఫ్లైఓవర్‌, జేఎన్‌టీయూ ఫ్లైఓవర్‌, కైత్లాపూర్‌ పైవంతెన, బాలానగర్‌ బాబూజగ్జీవన్‌ రామ్​ ఫ్లైఓవర్‌లపైకి ఆ సమయంలో వాహనాలను అనుమతించరు.

క్యాబ్స్‌, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణాలకు నిరాకరించకూడదని డీసీపీ సూచించారు. నిరాకరించే డ్రైవర్లపై వాహన నంబరు, సమయం తదితర వివరాలతో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు 9490617346 నంబరులో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details