జంటనగరాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించడం, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు చేపట్టడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు తనిఖీలు పెంచడమేకాక నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. హైదరాబాద్‌లోని గోషమహల్‌లో ట్రాఫిక్ రూల్స్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు..
గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఈ ఏడాది 12 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఈ ప్రమాదాల్లో మరణాలు పదిశాతానికి తగ్గిపోయాయి. 2018 జనవరి నుంచి జూన్ నెల వరకు 150 రోడ్డు ప్రమాదాలు జరగగా... ఈ ఏడాది 135 ప్రమాదాలు చోట చేసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
అతిక్రమిస్తే కేసే..
ఈ ఏడాది ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 15 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. వాహనాలు నడుపుతున్న 2,732 మంది మైనర్లపై కేసులు నమోదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. కేసుల్లో 40 శాతం పెరుగుదల ఉంది. వాహనాలకు సక్రమంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోని వాహదారులపై ఐపీసీ సెక్షన్‌లు, మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.