భాగ్యనగరంలో లాక్‌డౌన్ సమయంలోనూ ట్రాఫిక్‌జాంలు అవుతున్నాయంటూ ట్రాఫిక్ పోలీసులకు ఫోన్లు వస్తున్నాయి. రెండు రోజుల నుంచి పదుల సంఖ్యలో ఫోన్లు చేస్తున్న వారికి తమ సహాయ వాణి(హెల్ప్ లైన్) 90102 03626 నంబర్‌కు ఫోన్ చేయాలంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల కార్యకలాపాలు మొదలవడం వల్ల గత శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. తాము ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటూ వాహనదారులు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్ల వారు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సహాయవాణి నంబర్‌ను పొందుపరిచారు.
శని, ఆదివారాల్లో పెద్దగా ఫోన్లు రాలేదు... సోమవారం నుంచి వందల మంది సహాయవాణికి ఫోన్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు మరో రెండు ఫోన్ నంబర్లు 94905 98985, 040-2785 2482 అందుబాటులోకి తీసుకువచ్చారు.
సహాయ వాణి సేవలు..
ట్రాఫిక్‌జాంలు అవుతున్నాయంటూ ఫోన్లు చేస్తున్న వారి ద్వారా సమాచారం సేకరిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నారు. కొవిడ్-19 సమాచారం, సహాయం కోసం అందుబాటులోకి తెచ్చిన వివిధ శాఖల ఫోన్ నంబర్లలో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్ కూడా ఉండడంతో చాలామంది అంతరాష్ట్ర పాస్‌లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వాహనాలకు పాస్‌లను అడుగుతున్నారు. ఫలానా వెబ్‌సైట్‌లో పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ సిబ్బంది సూచిస్తున్నారు.