ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న(TRS Dharna) ధర్నాకు తెరాస పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. కలెక్టర్ల అనుమతితోనే ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వివరించారు. కలెక్టర్ల అనుమతితో ధర్నాలు నిర్వహించి విజయవంతం చేయాలని కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రైతులకు సంఘీభావంగా తెరాస ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా(TRS Dharna) నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్‌ను మంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వెంకటేశ్వర్లు, దానం నాగేందర్ ఉన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నా(TRS Dharna) నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర భాజపా నేతలు వరి పండించాలని చెబుతున్నారని.. కానీ ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణలోనే వరి పండిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తుందని మంత్రులు(TRS Dharna) స్పష్టం చేశారు.