Revanth at gandhi bhavan: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి సోనియా ఎవరిని నిర్ణయిస్తే వారినే పల్లకిలో భూజాలపై ఎత్తుకొని సీఎం పీఠంపై కూర్చోబెడతానని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా కాంగ్రెస్ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎవరూ కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశారు.
అప్పుడు సిద్దిపేట.. ఇప్పుడు హుజూరాబాద్
Revanth Comments: హుజూరాబాద్‌లో పార్టీ ఓటమితో కుంగిపోయిన నన్ను.. పార్టీకి 45 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించడం ద్వారా కార్యకర్తలు అండగా నిలిచారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ల గుండెల్లో ఉందని నిరూపించారు. డిసెంబరు 9న సభ్యత్వ నమోదు ప్రారంభిస్తే.. 95 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఆక్రమించిందని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ నమూనా సభ్యత్వాలు చేయండని పార్టీ అగ్రనేతలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక చరిత్ర గుర్తు చేయదల్చుకున్నా. హుజూరాబాద్‌లో 3,500 ఓట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పనైపోయిందని విమర్శించే వాళ్లకు ఒకటే చెబుతున్నా అంటూ రేవంత్ సవాల్ విసిరారు.
2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉపఎన్నిక వచ్చింది. అప్పుడు 90మంది ఎమ్మెల్యేలతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షనేత, సీఎల్పీ నాయకుడిగా ఉండి ఉపఎన్నికను ఎదుర్కొన్నారు. సిద్దిపేట ఉపఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే.. వైఎస్ నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత్‌రెడ్డికి 3,700 ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్‌లో వచ్చిన ఎన్నికల ఫలితాలు మొదటి సారి వచ్చినవి కావు. గొప్ప నాయకుడు రాజశేఖర్‌రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో అదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డి నాయకత్వం ఖతమై పోయింది. కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిపోయిందన్నారు. కానీ, 2004లో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి.. మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతి ఓటమి ఒక గెలుపునకు పునాది అవుతుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాకు ఒక అనుభవం.