తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం: ఉత్తమ్​ - uttam on dubbaka by elections

రానున్న ఎమ్మెల్సీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

tpcc-president-uttam-kumar-reddy-on-dubbaka-by-elections
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం: ఉత్తమ్​

By

Published : Oct 1, 2020, 4:40 PM IST

Updated : Oct 1, 2020, 5:39 PM IST

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారందరూ ఓటర్​ లిస్టులో పేరు నమోదు చేసుకునేలా కార్యకర్తలంతా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును సైతం ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

దుబ్బాక శాసన సభ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్​ గెలుచుకుని చరిత్ర సృష్టిస్తుందంటూ ఉత్తమ్​ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త, నాయకుడు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. మరోవైపు గ్రేటర్​ హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల కోసం సైతం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడతూ.. పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.

కిసాన్-మజ్దూర్ బచావో దివస్ పేరుతో నిరసనలు..

మరోవైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని ఉత్తమ్​ మండిపడ్డారు. ఇందుకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పునరుద్ఘాటించారు. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే చట్టాలు తెచ్చిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కిసాన్-మజ్దూర్ బచావో దివస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వ్యాపారులు పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించి.. బ్లాక్ మార్కెట్ చేసుకునేట్లు చట్టాలు చేయడం దారుణమని ఉత్తమ్‌ ఆరోపించారు. మద్దతు ధరకే పంట కొనుగోలు చేస్తామని.. చట్టంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తక్షణమే అసెంబ్లీని సమావేశ పరిచి.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు అమలు కాకుండా తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: గ్రాడ్యుయేట్​ ఓటర్​గా పేరు నమోదు చేసుకున్న మంత్రి కేటీఆర్​

Last Updated : Oct 1, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details