తెలంగాణ

telangana

ETV Bharat / state

Tourism: కొవిడ్ తగ్గుముఖం.. పర్యాటకానికి పెరిగిన డిమాండ్

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు యాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి, ఆధ్యాత్మిక యాత్రలకు డిమాండ్‌ పెరుగుతోంది. వారం లేదా పది రోజుల పర్యటనల్లో సుమారు 70% వయోవృద్ధులు ఉంటున్నారనే ఐఆర్​సీటీసీ వర్గాలు చెబుతున్నాయి. విమాన విహారానికీ సైతం ఆదరణ పెరిగింది. కశ్మీర్‌, మేఘాలయ వంటి ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారిలో యువకులు, మధ్యవయస్కులు అధికంగా ఉంటున్నారు.

Tourism increased
పర్యాటకానికి పెరిగిన డిమాండ్

By

Published : Oct 11, 2021, 4:55 AM IST

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతోండటం.. టీకాల పంపిణీ జోరందుకోవటం..వంటి పరిణామాలు పర్యాటకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కొవిడ్‌ భయంతో మొన్నటివరకు ఒకట్రెండు రోజులు, దగ్గర ప్రాంతాలకు వెళ్లివచ్చిన రాష్ట్రవాసులు.. నేడు కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీ, గుజరాత్‌, గోవా, కర్ణాటక, తమిళనాడు వంటి దూరప్రాంతాలకూ ఉల్లాసంగా తరలివెళుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్యరాష్ట్రాల్ని చుట్టేసి వస్తున్నారు. వారం, పదిరోజుల యాత్రలకు వెళుతున్నవారిలో 70శాతం పైగా సీనియర్‌ సిటిజన్లే ఉంటున్నారని ఐఆర్‌సీటీసీ వర్గాలు చెబుతుండటం ఆసక్తికర పరిణామం. కశ్మీర్‌, మేఘాలయ వంటి ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారిలో యువకులు, మధ్యవయస్కులు అధికంగా ఉంటున్నారు.

మారుతున్న చిత్రం..

కొవిడ్‌ మొదటి, రెండోదశల్లో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగ ముఖచిత్రం గతనెల నుంచి క్రమంగా మారుతూ వస్తోంది. పర్యాటకులు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు ముందుకొస్తున్నారు. దీంతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) బస్సుల్లో, ఇండియన్‌ రైల్‌ క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ‘పిల్‌గ్రిమ్‌ స్పెషల్‌ డీలక్స్‌ టూరిస్ట్‌ ట్రైన్‌’తో యాత్రలు నిర్వహిస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ టూరిస్ట్‌ ట్రైన్‌లోని ఒక బోగీలో రెండు కూపేల్ని ఐసొలేషన్‌గా మార్చింది. ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వారిని అక్కడికి మార్చి తర్వాతి స్టేషన్‌లో పరీక్షలు చేయిస్తోంది.

విమానయాత్రలకు బాగా గిరాకీ

ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైళ్లతో పాటు విమానప్రయాణాల ద్వారా కూడా పర్యాటకయాత్రలు నిర్వహిస్తోంది. ఒక్కో ట్రిప్పులో 15మందితో అనుకుంటే డిమాండ్‌ పెరగడంతో 25 మందిని తీసుకెళ్లాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఒక్క కశ్మీర్‌కే నాలుగు యాత్రలు నిర్వహించింది. ఐఆర్‌సీటీసీ సెప్టెంబరు చివరివారంలో 695 మంది పర్యాటకుల్ని వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, గయకు వారంరోజుల ట్రిప్పునకు తీసుకెళ్లగా అక్టోబరు తొలివారంలో తిరిగివచ్చారు. ఈ యాత్ర విజయవంతం కావడంతో ప్రతినెలా ప్రత్యేకరైలు నడిపేందుకు ఏర్పాట్లుచేసింది.

* అక్టోబరు 19 నుంచి రేణిగుంటలో బయల్దేరే ప్రత్యేకరైలు విజయవాడ, సికింద్రాబాద్‌ మీదుగా ఆగ్రా, మధుర, వైష్ణోదేవీ, హరిద్వార్‌, అమృత్‌సర్‌, దిల్లీ మీదుగా వెళుతుంది.

* నవంబరులో విజయవాడ, విశాఖపట్నం మీదుగా గుజరాత్‌లో సోమ్‌నాథ్‌, అహ్మదాబాద్‌కు మరో తీర్థయాత్ర రైలు వెళ్లనుంది.

* డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌ నుంచి మొదలయ్యే రైలులో సికింద్రాబాద్‌ మీదుగా తిరుపతి, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి వరకు యాత్ర సాగనుంది.

పర్యాటకుల నుంచి డిమాండ్‌

కొవిడ్‌ భయాన్ని వీడి ప్రజలు యాత్రలకు ముందుకొస్తున్నారు. హరితహోటళ్లలో గదుల బుకింగ్‌ బాగా పెరుగుతోంది. టీఎస్‌టీడీసీ బస్సులేవీ ఖాళీగా ఉండట్లేదు. తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీకి, షిర్డీకి పర్యాటక ప్యాకేజీలు మొదలుపెట్టి నిత్యం బస్సులు నడుపుతున్నాం. త్వరలో గుజరాత్‌ యాత్ర ప్రారంభం కానుంది. రోజూ 3, 4 బస్సుల్లో తిరుపతికి వెళుతున్నారు. తిరుపతి, భద్రాద్రి, యాదాద్రి, శ్రీశైలం, వేములవాడ, కొమురవెల్లి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు నాగార్జునసాగర్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి పర్యాటక ప్రదేశాలకు పర్యటకులు ఎక్కువగా వెళుతున్నారు.

- ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌

90శాతం మంది రెండుడోసుల టీకా తీసుకున్నవాళ్లే

కొవిడ్‌ మూడో ముప్పు ఉండకపోవచ్చన్న అంచనాలు పర్యాటకుల్ని ముందుకు రప్పిస్తున్నాయి. మా యాత్రలకు వచ్చేవారిలో 90శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నవాళ్లే. ఎయిర్‌ ప్యాకేజీలకు గిరాకీ బాగుంది. మధ్యప్రదేశ్‌, కశ్మీర్‌, వారణాసి, గోవాకు నడిపాం. త్వరలో కర్ణాటక, మేఘాలయలోని షిల్లాంగ్‌కు, ఇతర ప్రదేశాలకు యాత్ర నిర్వహిస్తాం. రైలు ఎక్కేముందు, ప్రతిరోజు యాత్రికుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నాం. తొలిట్రిప్పులో 695 మందిని తీసుకెళ్తే ఏ ఒక్కరికీ సమస్య రాలేదు. ఇందులో 70శాతానికి పైగా సీనియర్‌ సిటిజన్లు ఉన్నారు.

- కిషోర్‌సత్య, డిప్యూటీ జనరల్‌మేనేజర్‌, ఐఆర్‌సీటీసీ

ఇదీ చూడండి:Ramoji film city: రామోజీ ఫిల్మ్​సిటీలో రంగుల వినోదాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details