మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్‌వార్ ఉద్యమ నాయకుడు, గెరిల్లా పోరాట యోధుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే(రామకృష్ణ) (Maoist Leader RK) ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన కొన్ని ఘటనల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్నారు. పల్నాడు ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్నారు. తనతోపాటు కొంతమందిని ఉద్యమంలోకి తీసుకెళ్లడంతో మావోయిస్టు పార్టీలో జిల్లా ప్రాతినిధ్యం పెరిగింది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించే క్రమంలో స్వస్థలానికి రాలేకపోయారు. ఇప్పటికీ ఆర్కే (Maoist Leader RK) గురించి ఏ సమాచారం వచ్చినా ఇక్కడి వారు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ఆర్కేతో పాటు చదువుకున్నవారు, అప్పట్లో అనుబంధం ఉన్నవారు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్కే (Maoist Leader RK) చనిపోయారని వార్త విన్న పలువురు ఎక్కడ.. ఎలా చనిపోయారు.. అని? ఆరా తీశారు.
రాడికల్ విద్యార్థిగా ప్రస్థానం
నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్కే (Maoist Leader RK) స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం. ఇప్పటికీ అతని బంధువులు పల్నాడులోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. ఆర్కే తండ్రి (Maoist Leader RK Father) వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో రెంటచింతల మండలం తుమృకోటలో స్థిరపడ్డారు. అక్కడే పాఠశాల విద్య పూర్తిచేసిన ఆర్కే కళాశాల విద్యను మాచర్లలో పూర్తిచేశారు. ఆసమయంలోనే రాడికల్ విద్యార్థి నేతగా ఉంటూ పీపుల్స్‌వార్ ఉద్యమానికి ఆకర్షితులై వారితో కలిసిపోయారు. అక్కిరాజు హరగోపాల్(ఆర్కే) (Maoist Leader RK) చదువుకునే సమయంలో అందరితో పరిచయాలు ఏర్పరచుకుని విద్యార్థి నేతగా ఎదిగారు. ఉద్యమంలో చేరిన తొలిరోజుల్లో ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్లారని నాటి నుంచి 2004లో ప్రభుత్వంతో చర్చల సమయంలో జనారణ్యంలోకి వచ్చినప్పుడే ఆర్కే (Maoist Leader RK)ను స్థానికులు చూశారు. అప్పటివరకు పత్రికలు, టీవీల్లో వచ్చే ఊహచిత్రం చూడటమేనని స్థానికులు చెబుతున్నారు. జనారణ్యంలోకి వచ్చే సమయంలో గుత్తికొండ బిలం వద్ద సభ నిర్వహించారు. దీంతో రామకృష్ణ (Maoist Leader RK) పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వంతో శాంతిచర్చలు విఫలమైన తర్వాత ఆర్కే (Maoist Leader RK Team) బృందం మళ్లీ అడవిబాట పట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్కే (Maoist Leader RK)ను స్థానికులు చూడలేదు. ఆర్కే ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత ఉద్యమంలో ఉన్న పద్మక్కను ప్రేమ వివాహం చేసుకున్నారు.
నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా..
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (Maoist Leader RK) అనారోగ్యంతో మృతి చెందడం పల్నాడు ప్రాంతాన్ని కలచివేసింది. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు ప్రజల సమస్యలపై నిరంతరం ఉద్యమించారని, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం కడదాకా పోరాడారని గుర్తు చేసుకున్నారు.
- 1982లో పీపుల్స్‌వార్‌లో చేరిన తరువాత దాచేపల్లి మండలం నుంచే ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. దాదాపు పదేళ్ల పాటు శ్రీనగర్, రామాపురం, భట్రుపాలెం, గామాలపాడు ప్రాంతాల్లో ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. పీపుల్స్ వార్‌ను పల్నాట విస్తరించే క్రమంలో నాటుసారా వ్యతిరేక పోరాటం, దేవుని మాన్యాల పంపిణీ, కార్మిక ఉద్యమాలు నడిపి ప్రజలకు మరింత చేరువయ్యారు. గామాలపాడులోని ఎస్సీ కాలనీ వాసులతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బస్టాండ్‌లో ఆకలితో నిల్చొన్న ఆయన్ను (Maoist Leader RK) అక్కడి వారు చూసి ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టారు. ఆ కాలనీలో కొంత కాలం నివాసమున్నారు.
- 1985లో చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన ఒక శిక్షణ సమావేశానికి ఆయన వచ్చారు. ఆ రోజు రాత్రి ఆయన (Maoist Leader RK)తో పాటు మరి కొంతమంది అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేయగా ఆయన తప్పించుకున్నారు. మిగతా వారంతా అరెస్టయ్యారు.
- 1989లో పార్టీ స్వ్కాడ్ నిర్మాణంలో భాగంగా రహస్య స్థావరానికి వెళ్లారు. అనంతరం గెరిల్లా దళ నిర్మాణం జరిగినపుడు గుంటూరు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు.
- 1990-91 సమయంలో కృష్ణానదీ తీరానున్న రామాపురంలో జరిగిన జంట హత్యలు, దాచేపల్లి తహశీల్దారు కార్యాలయం పక్కనున్న ట్రెజరీ కార్యాలయాన్ని పేల్చిన కేసుల్లో నిందితునిగా ఉన్నారు. ఆ సమయంలో ఏకోనాంపేటలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు చనిపోగా, ఆర్కే తప్పించుకున్నారు. అనంతరం కోస్తా జిల్లాల కార్యదర్శిగా కొనసాగారు. రాష్ట్ర కమిటీకి వెళ్లిన తరువాత క్రమంగా పల్నాడుతో అనుబంధం తగ్గింది.
- మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (Maoist Leader RK) తండ్రి ఉద్యోగ్య రీత్యా తుమృకోటలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేయడంతో పల్నాడు ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఈ ప్రాంత రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. చదువుకునే సమయంలో సౌమ్యుడుగా, చదువరిగా ఉండే వాడని ఆయనతోపాటు ఇంటర్, డిగ్రీ కలిసి చదువుకున్న ఓ న్యాయవాది వాఖ్యానించారు. డిగ్రీ పూర్తయిన తరువాత మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై ఆ దిశగా ప్రయాణం సాగించారని తెలిపారు.
- ప్రధానంగా మాచర్లలో చదువుకునే సమయంలో అప్పటి గుంటూరు- మాచర్లకు వెళ్లే రైలు వీరి జీవితాలపై ప్రభావం చూపింది. దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల, రెంటచింతల నుంచి కూడా రైలులో మాచర్ల వెళ్లి చదువుకునే వారు. ఇంటర్మీడియట్ బైపీసీ రెండు సంవత్సరాలు, బీఎస్సీ సీబీజెడ్ మూడు సంవత్సరాలు.. మాచర్లకు రాకపోకలకు సాగించే క్రమంలో అనేక మందితో పరిచయాలు పెంచుకున్నారు. మాచర్ల కళాశాలలో ఆనాటి విద్యార్థి సంఘాల నాయకులతో అనుబంధం ఏర్పడింది.
నకిరేకల్‌లో ఆర్కేను కలిశాం
మావోయిస్టు అగ్రనేత ఆర్కే తండ్రి అక్కిరాజు సశ్చిదానందరావు తమతోపాటు తుమృకోట ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా చేశారు. 6 వతరగతి నుంచి 10 వతరగతి వరకు తుమృకోటలో తాను పని చేస్తున్నప్పుడే రామకృష్ణ చదివారని గుర్తుచేశారు. 1976లో అక్కడి నుంచి బదిలీపై వచ్చాక రామకృష్ణ (Maoist Leader RK) గురించి తెలియలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో మావోయిస్టులు చర్చలకు వెళ్లేటప్పుడు నకిరేకల్‌లో ఆర్కేను కలిశాం. ఆ రోజు తోటి ఉపాధ్యాయుడు మరొకరితో కలిసి నకిరేకల్ వెళ్లి కలిశాం. ఆర్కే వాళ్లు చర్చలకు వెళుతున్నారని తెలిసిందని, చీకటి పడటంతో నకిరేకల్‌లో వాళ్లు ఆగారని తెలుసుకుని వెళ్లాం. ఆర్కే (Maoist Leader RK) బృందం వెంట దాదాపు 50 పోలీసు వాహనాలు ఉన్నాయి. మాశిష్యుడే కదా చిన్నప్పుడు చూశాం ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్లాం. ఆర్కే చుట్టూ కర్రలతో మగ, ఆడపిల్లలు రక్షణ ఉంటూ తమను ఆర్కే (Maoist Leader RK) దగ్గరికి వెళ్లనీయలేదు. కొద్దిసేపటికి మాస్టార్లు వచ్చారని ఆర్కేకి ఎవరో చెబితే బయటకు వచ్చిన ఆర్కే మాకు నమస్కారమండీ అన్న తర్వాత మమ్మల్ని అనుమతించారు. అక్కడ వరవరరావు కూడా ఉన్నారు. మమ్మల్ని చూసి వరవరరావు వీరు మీ మాస్టార్లా.. అని ఆర్కేను అడిగారు. తాము పనిచేసే పాఠశాల గురించి, ఆర్కే తండ్రి సశ్చిదానందరావుతో ఉన్న అనుబంధం, పాఠశాల విషయాలు మాట్లాడుకున్నాం.