బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు పడగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్లు కురిసినట్లు వాతావరణశాఖ పేర్కొంది. బంగాళఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతం వరకూ వ్యాపించింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
నగరంలో రోడ్లు జలమయం
సోమవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, లిబర్టీ, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, తదితర చోట్ల వర్షం కురిసింది. ముషీరాబాద్, కవాడిగూడ, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్‌నగర్, గాంధీనగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. వివిధ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వాహనదారులు, బాటసారులు.... వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలటం వల్ల రోడ్లు రద్దీగా మారాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతోపాటు... విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.