Kodandaram's Call For The Great Footmarch : 'హార్డ్‌వేర్ పార్క్ హఠావో - తెలంగాణ బచావో' పేరుతో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు.. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ వెల్లడించారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన, పార్టీ నాయకులతో కలసి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు నాదర్గుల్ సెంటర్లో ప్రారంభమై.. ఆదిభట్ల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు మహా పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
Hardware Park Hathao - Telangana Bachao : ఈ మహా పాదయాత్రలో బాధిత రైతులు, నివాస స్థలాల యజమానులు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాధిత రైతులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవట్లేదని తెలిపారు. అవసరానికి మించి 1000 ఎకరాలు వ్యవసాయ భూమిని భూసేకరణ చేపట్టారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో జారీచేసిన భూ సేకరణ నోటిఫికేషన్ వల్ల గత 24 ఏళ్లుగా నాదర్గుల్, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట గ్రామాల ప్రజలు భూ దోపిడికి గురయ్యారని పేర్కొన్నారు.
అప్పటి ప్రభుత్వం అవసరమున్న భూమిని సేకరించిందని.. కానీ అవసరం లేని భూమిని కూడా అన్యాయంగా ఇప్పుడు ప్రభుత్వ ఖాతాలో చేర్చుకున్నారని తెలిపారు. ఆ భూమిలో దాదాపు 20 వేల ప్లాట్లు ఉన్నాయని.. AP/TSIIC వారు నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. అక్రమ ఎక్స్టెన్షన్ హార్డ్‌వేర్ పార్క్‌ని తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు బాధితులకు అండగా ఉంటామని ప్రొ. కోదండరామ్ స్పష్టం చేశారు.