Tips to Beat Insomnia in Telugu :మధ్యరాత్రిలో నిద్రాభంగం వల్ల ఇటు పూర్తిగా నిద్రపోయినట్లూ ఉండదు.. అటు మెలకువతో ఉన్నట్లూ ఉండదు.. సరిగ్గా నిద్ర లేక చిరాకు, కోపం వస్తుంది. ఫలితంగా ఆ రోజు ఏ పనిపైనా శ్రద్ద పెట్టలేరు. కింది వాటిని పాటించడం ద్వారా నిద్రభంగం సమస్య నుంచి బయటపడొచ్చు.
లెక్కపెట్టకండి.. మధ్య రాత్రిలో మెలకువ రాగానే.. పదే పదే గడియారంలో సమయం చూడకుండా అలాగే నిద్రపోండి. ఇలా ప్రతిసారీ టైం చూసుకుంటూ ఉంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుంది. అందుకే ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని నిద్రకు ఉపక్రమించండి.
కాసేపు వేరే ప్రదేశంలో.. కొందరికి నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం.. మొదలైన అలవాట్లుంటాయి. ఒకవేళ మీకు మధ్య రాత్రి మెలకువ వచ్చి.. మళ్లీ నిద్ర పట్టకపోతే.. వేరే గదిలోకి వెళ్లి మనసుకు ప్రశాంతత కలిగించే సంగీతం వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలి. దీంతో నిద్రపట్టే అవకాశం ఉంది.
తక్కువ లైటింగ్.. కొందరికి గదిలోని లైట్లన్నీ ఆఫ్ చేస్తేనే నిద్ర పడుతుంది. మీక్కూడా అదే అలవాటు ఉంటే పడకగదిలో సాధ్యమైనంత తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోండి. తొందరగా నిద్ర పడుతుంది. అప్పుడు మధ్య రాత్రిలో నిద్ర భంగం వాటిల్లదు. మంచి నిద్ర కోసం ప్రత్యేకమైన తక్కువ వాట్గల లైట్లను అమర్చుకోవాలి.
కళ్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త... ఈ తప్పులు చేస్తే భారీ మూల్యం తప్పదు!
మెడిటేషన్.. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ తిరిగి నిద్రలోకి జారుకునేందుకు తోడ్పడతాయి. ఉదాహరణకు మెడిటేషన్, విజువలైజేషన్, గాఢంగా శ్వాస పీల్చడం.. వంటి ప్రక్రియలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగించి నిద్రలోకి జారుకునేందుకు సహకరిస్తాయి. అలాగే ప్రతి రోజూ వ్యాయామం అవసరమే.
మంచి ఆహారం.. ప్రతిరోజు పడుకునే ముందే తేలిగ్గా జీర్ణమయ్యే మంచి ఆహారంతీసుకుని పడుకుంటే మధ్య రాత్రి మెలకువ రాదు.. అలాకాకుండా కొంతమంది డైటింగ్ అనీ.. ఇదనీ.. అదనీ.. కడుపునిండా తినకుండా లేదా లైట్ ఫుడ్ తీసుకుని పడుకుంటారు. ఇలాంటప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు . మధ్య రాత్రిలో ఆకలేస్తుంటుంది. దీనివల్ల మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుంది.