తండ్రీకొడుకులిద్దరూ ఒకే పాఠశాలలో చదవడమే కాదు... అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు మూడోతరాన్ని కూడా అక్కడే చేర్పించి ఆ పాఠశాలపై తమకు ఉన్న మక్కువను చాటుకున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఏ.కోడూరు ప్రాథమిక పాఠశాలలో మూడు తరాలకు చెందిన వారు ఉండటం విశేషం.
సొంతూళ్లోనే కొలువు సాధించి
ఔరా..! ఒకే బడిలో మూడుతరాలు.. తండ్రి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆయన కుమారుడు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆయన కుమారుడు అదే పాఠశాలలో విద్యార్థి. విశేషమేమిటంటే ఈ ముగ్గురు చదువుకున్నది ఒకే ప్రభుత్వ పాఠశాల కావడం. విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం ఏ. కోడూరుకు చెందిన మల్లేశ్వరరావు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1968 నుంచి 1973 వరకు ఇదే పాఠశాలలో చదువుకున్న మల్లేశ్వరరావు 1986లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి పలు పాఠశాలల్లో పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో బదిలీపై సొంతూరుకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. అయన కుమారుడు దుర్గాప్రవీణ్ కూడా ఇదే పాఠశాలలో చదువుకుని 2010లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. ఈ పదేళ్లలో రెండు, మూడు చోట్ల పనిచేసిన ఆయన బదిలీల్లో భాగంగా తాను కూడా సొంతూరుకు వచ్చారు. తండ్రి ప్రధానోపాధ్యాయుడిగాను, కుమారుడు ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు. అదే ఇంటిలో మూడో తరాన్ని కూడా ఈ పాఠశాలలోనే చేర్పించారు. ప్రవీణ్ తన కుమారుడిని సైతం అదే పాఠశాలలో చేర్పించి ఆ పాఠశాలపై తమకు ఉన్న మక్కువను చాటుకుంది ఈ కుటుంబం.
బడి గంట కొట్టడానికి ముందుగానే ఆ ఇంటి నుంచి మూడు తరాల కు చెందిన వారు పాఠశాలకు ప్రయాణమవుతారు. తాత, తండ్రి పాఠశాలలో పాఠాలు బోధిస్తుంటే మనవడు అనిరుద్ పలకా బలపం పట్టుకుని అక్షరాలు దిద్దుతుండడం చూసినవారంతా ముచ్చట పడుతున్నారు. బోధనలో అనుభవాన్ని తండ్రి నుంచి దుర్గా ప్రవీణ్ గ్రహిస్తుంటే ప్రస్తుతం పాఠశాలల్లో అమలుచేసే సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని కుమారుడు నుంచి మల్లేశ్వరరావు నేర్చుకుంటున్నారు.
ఇదీ చూడండి:Training in coding: సర్కారు విద్యార్థులకు కోడింగ్‌లో శిక్షణ.. 50 పాఠశాలల్లో అమలు