Thomas Reddy Speech about TSRTC Bill : గవర్నర్ ఆర్టీసీ బిల్లును సాయంత్రంలోపు ఆమోదించాలని.. లేదంటే మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ ఆర్టీసీ బిల్లు గవర్నర్ వద్దనే ఆగిందన్నారు. సంస్థ తాజా పరిస్థితిపై సమగ్ర రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చామని అయన సచివాలయంలో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉండాలని.. ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. క్యాడర్ల వారిగా అందరికి న్యాయం చేయాలన్నారు. అధ్యయన కమిటీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్(Telangana Mazdoor Union)కు అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. సంస్థలో ఉద్యోగులు 43 వేల 55 మంది ఉన్నారని అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విలీనంలో చాలా లొసుగులు ఉన్నాయని.. అలాంటి వాటికి తావులేకుండా ఉండేందుకు ప్రత్యేక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
"గవర్నర్ ఆమోదం పొందిన అనంతరం విలీనం చేసేందుకు ప్రభుత్వం సంస్థ పేరు, కమిటీ వేస్తారు. ఆ తరవాత తేదీలను ప్రకటిస్తుంది. అది కాస్త ఆలస్యం అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఈ సాయంత్రం లోపు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో నిరసన తెలియజేయాల్సి వస్తుంది. దీన్ని వల్ల ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇవన్ని అర్థం చేసుకుని బిల్లుపై ఆమోద ముద్ర వేయాలని కోరుతున్నాను. ఆర్టీసీ ఉద్యోగులు అందరికి సముచిత న్యాయం జరగాలి. 43 వేల 55 మంది ఉద్యోగులే కాకుండా మిగిలిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమ న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను." - థామస్ రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి