పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైంది. శనివారం ప్రకటించిన వార్డుల వారీ తుది ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. కార్పొరేషన్ల మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్ల పదవులకు రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగుతున్న వాటితో పాటు ఇప్పుడు ఎన్నికలు లేని వాటికి కూడా రిజర్వేషన్లు ప్రకటించారు.
జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాల్టీలకు సంబంధించి విలీన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వీటితో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పాల్వంచ, మణుగూరు, మందమర్రి మున్సిపాల్టీలను కూడా రిజర్వేషన్లలో పరిగణలోకి తీసుకోలేదు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం సహా 13 కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట సహా 123 మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి...
రాష్ట్రంలోని 13 కార్పోరేషన్లు యూనిట్‌గా తీసుకుంటే ఎస్టీ జనాభా ఒక శాతం కూడా లేదు. కానీ చట్టం ప్రకారం కనీసం ఒక పదవినైనా ఎస్టీలకు రిజర్వ్ చేయాల్సి ఉంది. అందుకే ఒక మేయర్ పీఠం ఎస్టీలకు దక్కింది. ఎస్సీల జనాభా మూడు శాతం ఉన్నందున ఒక మేయర్ పీఠాన్ని ఎస్సీలకు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీలకు చెరో ఎనిమిది శాతం రిజర్వేషన్లు మేయర్ పీఠాల్లో దక్కినట్లైంది. మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించారు. ఆ ప్రకారం బీసీలకు నాలుగు మేయర్ పీఠాలు దక్కాయి. మిగిలిన ఏడు మేయర్ పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
బీసీలకు 40 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులు..
మొత్తం 123 మున్సిపాల్టీల్లో ఎస్సీ జనాభా 3.3శాతంగా తేలింది. మున్సిపల్ ఛైర్పర్సన్ల పదవుల్లో వారికి 3 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఆ ప్రకారం ఎస్టీలకు 4 ఛైర్పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీల జనాభా 13 శాతానికి పైగా ఉండడం వల్ల 14 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీలకు 17 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులు కేటాయించారు. 50శాతంలో మిగిలిన రిజర్వేషన్ల శాతాన్ని బీసీలకు కేటాయించారు. 33శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీలకు 40 మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 62 మున్సిపాల్టీల ఛైర్మన్ల పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పీఠం మహిళదే..