Padayatra: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర 33వ రోజు చేరుకుంది. నిడదవోలు మండలం మునిపల్లి నుంచి చాగల్లు మండలం ఎస్ ముప్పవరం వరకు కొనసాగనుంది. మునిపల్లి నుంచి కోరుపల్లి సెంటర్ కలవచర్ల డి ముప్పవరంలో కాటన్ విగ్రహానికి రైతులు నివాళులర్పించారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు పలువురు వైకాపా కార్యకర్తలు మద్దతు పలికారు. పురుషోత్తపల్లి నుంచి డి.ముప్పవరం వరకు వైకాపా కార్యకర్తలు వచ్చారు.
సాటి రైతులుగా రాజధాని అమరావతికే మా మాద్దతు తెలుపుతున్నామని పలువురు వైకాపా కార్యకర్తలు తెలిపారు. ఆనాడు జగన్ పాదయాత్రపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇప్పుడు రైతుల పాదయాత్రపై జగన్‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజావ్యతిరేక అంశాల నుంచి జగన్ బయటకు రావాలన్నారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు వంతెనను ఇవాళ్టి నుంచి వారంపాటు మూసివేయడం చర్చనీయాంశమైంది. ఈనెల 17న రోడ్ కమ్ రైల్వే వంతెన మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా ఈలోపే వంతెన మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గామన్ వంతెన మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. మరమ్మతుల కోసమే బ్రిడ్జిని మూసేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐతే ఇన్నాళ్లుగా పట్టించుకోని ప్రభుత్వానికి ఇప్పుడే మరమ్మతులు గుర్తొచ్చాయా అని.. అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు.
మహా పాదయాత్ర చూసి ప్రభుత్వం భయపడుతోందని అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతి రావు అన్నారు. రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే వంతెన మూసివేసినంత మాత్రాన పాదయాత్రకు ఇబ్బందేమీ లేదని అన్నారు. 33 రోజులుగా రహదారులపై నడుస్తుంటే రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయని కనీసం గుంతల్ని కూడా ప్రభుత్వం పూడ్చడం లేదని ధ్వజమెత్తారు. గోదావరి జిల్లాల వాసులు మూడున్నరేళ్లుగా రైలు వంతెనపై తీవ్ర ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారని.. ఇప్పటికైనా వంతెన బాగు చేయాలని ప్రభుత్వానికి గుర్తుకు రావటం తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన మరో రెండు రోజులు పాదయాత్ర పెరుగుతుందని.. తమ మనోబలం దెబ్బతినదని తెలిపారు.