తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమానికి పెద్దపీట... ఈసారి రెండు లక్షల కోట్ల బడ్జెట్!

పూర్తి ఆశావహ దృక్పథంతో రాష్ట్ర బడ్జెట్‌ రానుంది. కరోనా పరిణామాలు, పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా వార్షిక పద్దు సిద్ధమైంది. 2021-22 బడ్జెట్‌ రెండు లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉంది. సొంత ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు ఇతర మార్గాల్లో నిధులను ప్రభుత్వం సమీకరించనుంది. ఎప్పట్లాగే ప్రాధాన్య రంగాలకు పెద్దపీట వేయనున్నారు. దళితుల సాధికారతకు ప్రత్యేక నిధులు, ఉద్యోగుల వేతనసవరణ, సమగ్ర భూసర్వే, హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధికి కేటాయింపులు ఉండే అవకాశాలున్నాయి.

సంక్షేమానికి పెద్దపీట... ఈసారి రెండు లక్షల కోట్ల బడ్జెట్!
సంక్షేమానికి పెద్దపీట... ఈసారి రెండు లక్షల కోట్ల బడ్జెట్!

By

Published : Mar 18, 2021, 5:11 AM IST

రాష్ట్ర వార్షిక పద్దు ఇవాళ వెల్లడికానుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... వార్షికపద్దుకు ఆమోదముద్ర వేసింది.

ఆశాజనకంగా బడ్జెట్...

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆశావహ దృక్పథంతోనే బడ్జెట్ రూపుదిద్దుకొంది. కరోనా కష్టకాలం ఆ తర్వాత క్రమేణా వివిధ రంగాలు పుంజుకున్న నేపథ్యంలో బడ్జెట్ ఆశాజనకంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కరోనా కారణంగా మొదట్లో రాబడులు, ఆదాయం భారీగా తగ్గినప్పటికీ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బాగా పెరిగాయి. చివర్లో పెరిగిన అంచనాల ఆధారంగానే 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం.

నిధుల సమీకరణ...

సొంత ఆదాయంలో పెరుగుదల, ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ, అదనపు రుణాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అన్ని శాఖలకు గంపగుత్తగా కేటాయింపులు పెంచాలన్న విధానానికి బదులు వాస్తవ, కచ్చిత, తప్పనిసరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచినట్లు సమాచారం.

సింహభాగం వాటికే...

అందుకే ఈమారు అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ప్రత్యేకంగా తీసుకోలేదు. ఆయా శాఖల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశారు. ప్రాధాన్య రంగాలకు ఎప్పట్లాగే సింహభాగం కేటాయింపులు ఉండనున్నాయి. సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు దక్కనున్నాయి. ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే హామీల అమలు కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రత్యేక నిధులు...

దళితుల సాధికారత కోసం ఈమారు బడ్జెట్​లో ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి అదనంగా మరో రూ. వెయ్యి కోట్లు కేటాయించవచ్చని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని రెండు, ముూడు రోజుల్లో శాసనసభలో ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్వహణాపద్దులో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది.

ప్రాజెక్టులకు కేటాయింపులు...

వ్యవసాయ యాంత్రీకరణ, ఉద్యానవన పంటలు సాగు చేసే వారికి ప్రోత్సాహకాల కోసం కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది. సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని సీఎం గతంలో తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టులకు కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. కొంత మొత్తం బడ్జెట్ నిధులతోపాటు మరికొంత మొత్తాన్ని రుణాల ద్వారా సమకూర్చుకునే అవకాశం ఉంది.

సమగ్ర భూసర్వే...

భూవివాదాలను శాశ్వతంగా రూపుమాపేలా రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహిస్తామని, బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్న సీఎం హమీ నేపథ్యంలో అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉండనున్నాయి. మరో మూడు లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి, అర్బన్ మిషన్ భగీరథకు, హైదరాబాద్‌లో నాలాల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. కొత్త ఫించన్ల కోసం ఆసరాకు నిధులు పెంచనున్నారు.

రూ. రెండు లక్షల కోట్ల మార్క్..

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. లక్షా 82 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి రాబడులు గణనీయంగా పడిపోయాయి. రుణాల ద్వారా నిధులను ఎక్కువగా సమకూర్చుకుంది. కార్యకలాపాలు మళ్లీ పుంజుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది పరిస్థితులు ఆశావహంగానే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం పెరగనుంది. కనీసం పదిశాతం అంచనాలు పెరిగినా రాష్ట్ర పద్దు రెండు లక్షల కోట్ల మార్కును అధిగమించనుంది.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ

ABOUT THE AUTHOR

...view details