VRAs regularize in telangana గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) అందరినీ ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధమైంది. సీనియర్ అధికారి శేషాద్రి నేతృత్వంలో ఏర్పాటైన ఐఏఎస్ అధికారుల కమిటీ దీనిపై తమ సిఫార్సుల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. సెప్టెంబరు మొదటి వారంలో క్రమబద్ధీకరణ పూర్తిచేయాలని ప్రభుత్వ యోచన. దీనిపై ఇటీవల ట్రెసా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వానికి పంపిన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం 21 వేల మంది వీఆర్‌ఏల్లో.. పదో తరగతి, ఆపైన విద్యార్హత ఉన్న తొమ్మిది వేల మందికి మాత్రమే పదోన్నతులు దక్కనున్నాయి. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రెండేళ్ల కిందటే హామీ ఇవ్వగా తాజాగా దీనికి రెవెన్యూ, ఆర్థికశాఖలు తుదిరూపు తీసుకొచ్చాయి. జిల్లాల వారీగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) పూర్తి సమాచారం తీసుకుంది. క్రమబద్ధీకరణలో భాగంగా వీఆర్‌ఏలకు పేస్కేలు చెల్లిస్తారు. వేతన వివరాలు మాత్రం ఖరారు కాలేదని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి.
మార్గదర్శకాలు ఇలా ఉండొచ్చు..
* అర్హత ఉన్న వారికి వెంటనే పదోన్నతులు కల్పిస్తారు. ఉన్నత విద్యార్హతలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వారిని ధరణి ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమిస్తారు. తహసీల్దారు కార్యాలయాల్లోని ఖాళీ పోస్టుల్లో ఎక్కువ మందిని సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.
* కొందరిని డ్రైవర్లు, అటెండర్లు తత్సమానమైన పోస్టుల్లో నియమిస్తారు.