నిషేధిత భూములకు (prohibited Land) చెందిన సమస్యలను రెండు రోజుల్లోగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధిత జాబితాలో వాటి సర్వే నంబర్లను చేర్చింది. దీంతో భూసేకరణ సమయంలో ఒక సర్వే నంబరులో కొంత భూమిని సేకరిస్తే ఆ సర్వే నంబరులోని పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయి. దేవాదాయ, వక్ఫ్ భూముల సర్వే నంబర్లలో ఉన్న పట్టా భూములది అదే పరిస్థితి.
ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు జరగకుండా వాటి సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులకు చెందిన లక్షలాది ఎకరాలు భూములు నిషేధిత జాబితాలో పడ్డాయి. దీంతో భూములు రైతుల అధీనంలో ఉన్నప్పటికీ వాటికి చెందిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంక్ రుణాలు రాక, క్రయవిక్రయాలు జరగక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధరణి పోర్టల్‌లో సవరణలకు అవకాశం లేకపోవడంతో.. అధికారులు కూడా ఏమి చేయలేకపోయారు.