పాపికొండల విహార యాత్రలో బోటు మునిగి గల్లంతైనవారి జాడ కోసం ఐదోరోజూ... అన్వేషణ సాగినా ఫలితం లేకపోయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ , నౌకాదళం, పోలీసులు, స్థానిక గిరిజనులు, సిబ్బంది ముమ్మరంగా గాలించినా.. ఎవరి ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహాలు నదిలో నుంచి పైకి తేలలేదు. బోటు మునిగిన ప్రాంతంలో దుర్వాసన వస్తుడటం వల్ల మరికొన్ని మృతదేహాలు ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్.. నిపుణుల బృందాలతో కలిసి బోటు మునిగిన ప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించారు. కాకినాడకు చెందిన నిపుణులైన మత్స్యకారుల బృందంతోనూ చర్చలు జరిపారు. నాలుగువైపులా కొక్కేలు వేసి బోటును కనీసం కదిపేందుకైనా అవకాశం ఉందా అన్న అంశంపై చర్చించారు. స్థానిక మత్స్యకారులు బోటు వెలికితీసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఎంపీని కోరగా.. ఆయన అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.