girls adoption: కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో దత్తతలు పెరిగాయి. దత్తతలో ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తులు సామాజిక దురాచారం, అసహాయ పరిస్థితులు, పేదరికం, గృహహింస కారణంగా కన్నపేగు బంధాన్ని కాదనుకుని పుట్టిన వెంటనే వదిలేస్తుంటే.. పిల్లలు లేక ఆరాటపడుతున్న దంపతులు ఎక్కువగా ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు.
గత ఏడాది కాలంలో జరిగిన దత్తతల్లో మగ పిల్లలతో పోల్చితే ఆడపిల్లల సంఖ్య రెండింతలుగా ఉంది. మగపిల్లలు 53 మంది ఉంటే.. ఆడపిల్లలు 116 మంది ఉన్నారు. విదేశీ దంపతులకు దత్తత కింద వెళ్తున్నవారిలోనూ ఆడపిల్లలే ఎక్కువ.
ఆడపిల్లలకే ప్రేమ ఎక్కువ..!
పిల్లల్లేని దంపతులు అధికారికంగా దత్తత కోసం కేంద్రీయ దత్తత ఏజెన్సీ(కారా)కి దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి వారి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య తదితర పరిస్థితులు పరిశీలించి అనుమతిస్తున్నారు. అసహాయ స్థితుల్లో ఉన్న, రోడ్డుపై దొరికిన చిన్నారులు, అమ్మానాన్నలు లేని అనాథ పిల్లలను శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీస్తున్నారు. వారిని పిల్లల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదంతో స్వీయ సంరక్షణలోకి తీసుకుని హైదరాబాద్‌లోని శిశు విహార్‌తో పాటు జిల్లాల్లోని శిశు గృహల్లో పునరావాసం కల్పిస్తున్నారు.
మూడేళ్లలోపు పిల్లల్ని ప్రత్యేక సంరక్షణలో పెడుతున్నారు. న్యాయప్రక్రియ అనంతరం పిల్లలు లేని దంపతులకు ‘కారా’ నిబంధనల ప్రకారం దత్తతకు అనుమతిస్తున్నారు. కారాలో దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారికి సీనియారిటీ ప్రకారం అందుబాటులోని పిల్లల్ని దత్తత ఇస్తున్నారు. ఇందుకోసం దంపతులు కనీసం రెండేళ్ల నుంచి అయిదేళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది.