పురపాలక ఎన్నికల్లో నామపత్రాల పర్వం ఊపందుకుంది. 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంస్థలకు 2 రోజులుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటిరోజైన బుధవారం 967 నామినేషన్లు దాఖలు కాగా... రెండో రోజు 4వేల722 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 5వేల 689 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 143 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామపత్రాలు దాఖలు చేశారు. అధికార తెరాస... గురువారం ఏ ఫారాలు, బీ ఫారాలు పంపిణీ చేసింది. ఇతర పార్టీలు ఇవాళ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నాయి. పోటీ చేసేది ఎవరో స్పష్టత రావడంతో నేడు భారీ సంఖ్యలో నామపత్రాలు వచ్చే అవకాశం ఉంది.
ఏ జిల్లాలో ఎంతంటే?
రెండో రోజైన గురువారం అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 592 నామపత్రాలు రాగా...... 422 నామినేషన్లతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో 414, మేడ్చల్లో 387, పెద్దపల్లిలో 386 మంది నామపత్రాలు సమర్పించారు. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 నామినేషన్లే వచ్చాయి. జగిత్యాల జిల్లాలోని 5పురపాలికల్లో తొలిరోజు కేవలం 78 నామినేషన్లు రాగా... గురువారం 320 నామపత్రాలు దాఖలయ్యాయి. కరీంనగర్జిల్లా హుజూరాబాద్లో 64, జమ్మికుంటలో 66 నామపత్రాలు వచ్చాయి. నిర్మల్జిల్లా భైంసాలో ఎంఐఎం పార్టీ తరపున 15 మంది నామినేషన్లు వేశారు. కొత్తగా ఏర్పడ్డ బాన్సువాడ మున్సిపాలిటీలో నామినేషన్లు వేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు.
కరీంనగర్‌కు గ్రీన్ సిగ్నల్
అటు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు ఇస్తారు. నేటి నుంచి ఈనెల 12 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. 24న పోలింగ్నిర్వహించి, 27న ఓట్ల లెక్కింపు చేపడుతారు.
నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ