Telangana Budget Sessions 2023 : బడ్జెట్ సమావేశాలపై ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య తలెత్తిన వివాదం... హైకోర్టు, సీనియర్ న్యాయవాదుల చొరవతో సద్దుమణిగింది. ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈనెల 21న ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ పంపించింది. గవర్నర్ నుంచి స్పందన రాకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు... గవర్నర్ కార్యాలయానికి వెళ్లి కలిసి అనుమతివ్వాలని కోరారు. ఈనెల 27న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మరో లేఖ రాశారు.
స్పందించిన రాజ్‌భవన్ కార్యాలయం... గవర్నర్ ప్రసంగం ఉందా? లేదా.. ఉంటే వెంటనే ప్రసంగం పంపించాలని సీఎంవోకు లేఖ పంపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం సమావేశాలు ప్రారంభం కానున్నందున.. అత్యవసర విచారణ జరిపి అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం... మధ్యాహ్నం ఒంటిగంటకు లంచ్ మోషన్ విచారణ చేపట్టింది.
న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారు :రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆర్థిక బిల్లులు, బడ్జెట్‌కు గవర్నర్ తప్పనిసరిగా అనుమతివ్వాల్సిందేనని ప్రభుత్వం వాదించింది. గవర్నర్ విచక్షణాధికారం రాజ్యాంగ పరంగానే ఉంటుంది కానీ... వ్యక్తిగతంగా కాదని పేర్కొంది. విచారణపై స్పందించిన ధర్మాసనం.. వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ వ్యవస్థలను కోర్టు ముందుకు తీసుకురావడం ఎందుకని వ్యాఖ్యానించింది. గవర్నర్ విధులపై న్యాయసమీక్ష జరిపే పరిధి.. నోటీసు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందా.. ఈ వివాదంలో తాము ఏమని ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది.
రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు : రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చనన్న దుష్యంత్ దవే.. పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. వివాదం సున్నితత్వం, సంక్లిష్టత అర్థం చేసుకోగలనన్న దుష్యంత్ దవే... గవర్నర్ ను అనుమతివ్వాలని కోరూతూ ఉత్తర్వులు ఇవ్వొచ్చునని కోర్టుకు నివేదించారు. ఈలోగా భోజన విరామ సమయం రావడంతో.. వీలైతే ప్రభుత్వం, రాజ్ భవన్ తరఫు న్యాయవాదులు చర్చించి పరిష్కరించుకోవాలని సూచిస్తూ విచారణ మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేసింది.
ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదువుతారు: హైకోర్టు సూచన మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చాంబర్‌లో ప్రభుత్వం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే, గవర్నర్ తరఫు న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ చర్చలు జరిపారు. అనంతరం రెండున్నరకు విచారణ ప్రారంభం కాగానే... సానుకూల వాతావరణంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని దుశ్యంత్ దవే ధర్మాసనానికి తెలిపారు. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ ప్రారంభమవుతుందని... ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదువుతారని దుశ్యంత్ దవే వెల్లడించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని... పెండింగులో ఉన్న బిల్లులపై మంత్రుల నుంచి వివరణ తీసుకొని పరిష్కరించేలా అంగీకారమైందని వివరించారు. గవర్నర్ పట్ల ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తిస్తోందని... కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని అశోక్ ఆనంద్ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలకు సూచిస్తాను : గతేడాది కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి ఆహ్వానించలేదని అశోక్ ఆనంద్ కుమార్ అన్నారు. గణతంత్ర వేడుకలను సరిగా నిర్వహించ లేదన్నారు. మహిళ అని కూడా చూడకుండా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని చెప్పారు. స్పందించిన దుశ్యంత్ దవే.. గవర్నర్‌నే కాదు.. ఏ మహిళనూ తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదన్నారు. ఈ విషయంలో నాయకులను నియంత్రించాలని ప్రభుత్వ పెద్దలకు తాను కూడా సూచిస్తానని హామీ ఇచ్చారు. చర్చల ద్వారా పరిష్కారమైనందున పిటిషన్‌పై విచారణ ముగించాలని దుశ్యంత్ దవే కోరారు. అంగీరించిన ధర్మాసనం... గవర్నర్‌కు తాము నోటీసు ఇవ్వలేమని.. అయినప్పటికీ గవర్నర్ తరఫున న్యాయవాది హాజరై చర్చల ద్వారా పరిష్కరించుకున్నందున విచారణ ముగించినట్లు పేర్కొంది.
ఇవీ చదవండి: