damera rakesh update: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన దాడి ఘటనలో గాయపడ్డ దామెర రాకేశ్ మృతదేహాన్ని అధికారులు వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉదయం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ రాకేశ్‌ను హుటాహుటిన గాంధీకి తరలించారు. బాధితుడిని ఆస్పత్రికి తీసుకువచ్చేప్పటికీ పల్స్ లేదని.. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఉపయోగం లేకపోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.
మధ్యాహ్నం శవపరీక్ష అనంతరం.. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాకేశ్ మృతదేహాన్ని అతని స్వగ్రామం వరంగల్ జిల్లా దబీర్‌పేటకు తరలించారు. ఆసుపత్రి వద్ద ఆందోళన జరగకుండా అందరి దృష్టి మరల్చి పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పటికీ... ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది రాకేష్ చిరకాల స్వప్నం అని బాల్య మిత్రుడు అరుణ్ అన్నాడు. తన మిత్రుడి తల్లిదండ్రులు వృద్ధులు అని.. సోదరి స్ఫూర్తితో బాపట్లలో ఉచిత శిక్షణ తీసుకుని రెండు పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడై మూడో పరీక్షకు సిద్ధమవుతూ ఎదుర్కొని సైన్యంలో చేరాలని అనుకున్నాడని వాపోయాడు.
మరోవైపు ఇవాళ్టి ఘర్షణలో గాయపడ్డ సుమారు 14మందికి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఫైరింగ్‌లో బుల్లెట్ తగిలి ఛాతీలో గాయమైన మరో వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలిపారు. ఇక కాలికి గాయం అయిన మరో బాధితుడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరో 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. అయితే బాధితుల శరీరంపై బుల్లెట్ గాయాలాంటి ఆనవాళ్లు ఉన్నట్టు రాజారావు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే నిర్ధారించగలమని వివరించారు.