ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రోజూ కొన్ని వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. పైగా ఆ వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలితే భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. పైగా ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్లే వృథానీరు మరింత ప్రమాదకరం. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుని గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మహాత్మగాంధీ ఆస్పత్రి నిర్వాహకులు తమ ఆస్పత్రిలో మురుగునీటిని శుద్ధి చేసే సీవేజ్ ట్రీట్ మెంటు ప్లాంటును ఏర్పాటు చేశారు.
స్వతహాగా మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి.... తనే ముందడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వ్యయ, ప్రయాసలను పక్కన పెట్టి 40 వేల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి వ్యవస్థను నిర్మించారు. మహాత్మగాంధీ ఆస్పత్రిలో వివిధ విభాగాల నుంచి వచ్చే వ్యర్థ జలాలు ప్లాంటుకు చేరేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ శుద్ధి జరిగిన తర్వాత మొక్కలకు పెడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో నాలుగు దశల్లో నీటి వృథాను అరికట్టేందుకు ఈ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందుకోసం ఏడు మోటార్లు అమర్చి వ్యర్థజలాల్లో బ్యాక్టీరియాను తొలగించేలా ఐదు రకాల ద్రావణాలను వినియోగిస్తున్నారు.